డబ్బు సంపాదించడమూ ఓ కళే. ఇది హీరోయిన్‌లకు బాగా తెలుసు. ఒక్కసారి తెరపై మెరిసి.. పేరు తెచ్చుకుంటే చాలు. ఇక కాసుల వేటకు కావాల్సినన్ని దారులు తెరచుకుంటాయి. ఓ వైపు వరుస సినిమాలు, మరోవైపు వాణిజ్య ప్రకటనల సందడి. వీటన్నింటి మధ్య రిబ్బన్ కటింగ్‌ల హంగామా. ఇప్పుడీ ఆదాయ మార్గాలన్నీ కరోనా దెబ్బకు మూసుకు పోయాయి. కానీ, ఇలాంటి సమయంలోనూ కొత్త మార్గాలను ఎంచుకొని.. కాలు బయటపెట్టకుండా రెండు చేతులా సంపాదించుకుంటున్నారు కొందరు నాయికలు. సామాజిక మాధ్యమాల వేదికగా వివిధ వాణిజ్య సంస్థలకు ప్రచారం కల్పిస్తూ.. ఇంటిపట్టునే ఉంటూ సంపాదిస్తున్నారు. ఆ నాయికలెవరు? వాళ్ల ఆదాయ మార్గాలేంటో చదివేద్దాం.
సినిమాలు.. వాణిజ్య ప్రకటనలు.. సినీతారల జీవితంలో ఈ రెండింటినీ వేర్వేరుగా చూడలేం. ముఖ్యంగా నాయికలకు ఇవి రెండు కళ్లలాంటివే. ఎందుకంటే వెండితెరపై మెరిసే చాలా మంది నాయికల సినీ ప్రస్థానానికి ఈ వాణిజ్య ప్రకటనలే తొలి మెట్టుగా ఉపయోగపడుతుంటాయి. నేడు వెండితెరపై అగ్ర నాయికలుగా సందడి చేస్తున్న సమంత, కాజల్, తమన్నా, పూజా హెగ్డే తదితరులంతా తొలినాళ్లలో పలు ప్రకటనల్లో హొయలొలికిస్తూ సందడి చేసి మెప్పించిన వాళ్లే. ఇక రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టి పేరు, క్రేజు తెచ్చుకున్నాక.. ఈ ప్రకటనలే వాళ్లకు మరో ప్రధాన ఆదాయ వనరులవుతుంటాయి. సినిమాల ద్వారా ప్రజల్లో దక్కించుకున్న గుర్తింపుతో పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఆదాయాల్ని ఆర్జిస్తుంటారు. అందుకే నాయికలకు ఏమాత్రం తీరిక దొరికినా వాణిజ్య ప్రకటనల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
కరోనా వల్ల మూడు నెలలుగా సినిమా షూటింగ్‌లతో పాటు వాణిజ్య ప్రకటనలూ నిలిచిపోయాయి. అయితే సృజనాత్మకంగా ఆలోచించగలగాలే కానీ, ఇలాంటి లాక్‌డౌన్‌లు తమ ఆదాయ ఆర్జనకు అడ్డుకాదని నిరూపించారు మన కథానాయికలు. ఈ సమయంలోనూ ఇంట్లోనే ఉంటూ పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించి కాసులను వెనుకేసుకున్నారు.
అయితే ఇవన్నీ బుల్లితెరలపై సందడి చేసే ప్రకటనలు కాదు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజల్ని ఆకర్షించేవే. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఆయా నటీమణులకున్న ఫాలోవర్ల సంఖ్యను బట్టీ.. కొన్ని సంస్థలు వాళ్ల ఖాతాల్లో ఈ ప్రకటనల్ని పోస్ట్ చేయిస్తుంటాయి.
ఇప్పుడీ లాక్‌డౌన్ కాలంలో ఇలాంటి వాణిజ్య ప్రకటనల్లో మురిపించిన నాయికల్లో ముందు వరుసలో ఉంది కాజల్ అగర్వాల్. ఆమె ఈ మూడు నెలల సమయంలో ఓ హాలీవుడ్ సంస్థకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం, విద్యుత్ బిల్లుల చెల్లింపు సంస్థకు చెందిన ఓ యాప్‌తో పాటు ఓ జాబ్ సైట్ ప్రకటనలోనూ సందడి చేసింది.

వీళ్లతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఈ లాక్‌డౌన్ సమయంలో వరుస ప్రకటనలతో జోరు చూపించింది. పెటా ఇండియా కవర్ పేజీపై తళుక్కున మెరవడమే కాకుండా ప్రాంతీయ ఆహార పదార్థాలు అందించే ఓ వాణిజ్య సంస్థకు చెందిన ప్రకటనలోనూ నటించింది.

ఇక రష్మిక, తమన్నాలు ఈ లాక్‌డౌన్ సమయానికి తగ్గట్లుగా ఓ గేమ్ యాప్ కోసం ప్రచారం చేసి పెట్టారు.


ఇక దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే.. 'స్వాగ్ సె సోలో' అంటూ ఓ శీతలపానీయ సంస్థకు ఇంటి పట్టునే ఉండి ప్రచారం చేసి పెట్టింది. రెండు నెలలుగా ఇంటి పట్టునే ఉన్న అక్కినేని సమంత తాజాగా ముఖానికి రంగేసుకుంది. ఓ ప్రముఖ ఆన్‌లైన్ వస్త్ర సంస్థకు చెందిన యాప్‌కు ప్రచారం చేసింది.

ఇల్లే స్టూడియో.. సెల్‌ఫోనే మెగాఫోన్
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు వాణిజ్య ప్రకటనల రూపకల్పనలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా స్టార్‌లతో చేసే ప్రకటనల్ని సినిమాల స్థాయిలోనే భారీగా తెరకెక్కిస్తున్నారు. లాక్‌డౌన్‌తో వీటి చిత్రీకరణలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే చాలా వాణిజ్య సంస్థలు.. తమ ఉత్పత్తుల ప్రచారానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నాయి. తమ ప్రచార తారలు ఇంటి పట్టునే ఉండి, స్వీయ చిత్రీకరణతో పూర్తి చేయగలిగేలా చిన్న కాన్సెప్ట్‌లను రూపొందించి అందిస్తున్నాయి. వీటిని సదరు నాయికలు ఇంట్లో సెల్‌ఫోన్లు, అందుబాటులో ఉన్న కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. వాటిని సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌ల్లోనే చిన్నపాటి ఎడిటింగ్ హంగులతో ముస్తాబు చేసి, తమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
ఇది చూడండి : 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వచ్చేది అప్పుడే!