ఐన్‌స్టీన్‌లా మారిన బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్! - షారుక్‌ఖాన్ మూవీ అప్డేట్
'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఓ వినూత్న పాత్రలో కనిపించనున్నాడట షారుక్. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానితోపాటే ఓ ఫొటో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వెండితెరపై కనిపించి దాదాపు ఏడాదైంది. 'జీరో' (2018) తర్వాత మరో సినిమాలో నటించలేదు. కొత్త ప్రాజెక్టు ఎప్పుడు ప్రకటిస్తారని అభిమానులు కొన్ని రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారు. పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నా, ఏదీ ఇంతవరకు ఖరారు కాలేదు. అయితే 'బ్రహ్మాస్త్ర' సినిమాలో షారుక్ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. అందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని వైరల్‌గా మారాయి. అందులో శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ను పోలిన వేషధారణలో ఈ నటుడు ఉండటం విశేషం.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్, నాగార్జున నటిస్తున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఇందులో షారుక్ శాస్త్రవేత్త పాత్రలో కనిపించనున్నాడని టాక్. రణబీర్ పాత్రను బ్రహ్మస్త్రకు దగ్గరగా చేసేందుకు సహాయపడే సైంటిస్ట్‌గా కనువిందు చేయనున్నాడని సమాచారం. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

'బ్రహ్మాస్త్ర'ను గత డిసెంబర్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ గ్రాఫిక్స్‌లో జాప్యం వల్ల వాయిదా పడింది. ఫలితంగా ఈ ఏడాది డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
ఇదీ చూడండి.. కొంచెం ఉంటే కళ్లు తిరిగి పడిపోయేదాన్ని: నటి రాధిక