ETV Bharat / sitara

Bheemlanayak: 'పవన్‌తో సినిమా అనగానే.. షాకయ్యా' - Bheemlanayak director Sagar K Chandra movies

Bheemlanayak director: పవన్​కల్యాణ్​తో 'భీమ్లానాయక్'​ సినిమా తీసి సక్సెస్​ అందుకున్నారు దర్శకుడు సాగర్​ కె చంద్ర. అయితే ఆ విజయం, ఆయన దర్శకుడిగా మారడం అంత సులువుగా జరగలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఆ విశేషాలన్నీ సాగర్​ మాటల్లోనే..

Bheemlanayak
Bheemlanayak
author img

By

Published : Feb 27, 2022, 7:33 AM IST

Bheemlanayak director: ఏ మాత్రం సినిమాల ఆలోచనే లేకుండా పెరిగిన ఓ కుర్రాడు బాగా చదువుకుని అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు 'నేను డైరెక్టర్ని' అవుతానంటూ ఉద్యోగం మానేసి ఇండియాలో వాలిపోయాడు. అనుభవం, సినీ నేపథ్యం లేకపోయినా పట్టుదలతో దర్శకుడయ్యాడు. అతగాడు మరెవరో కాదు తాజా సంచలనం 'భీమ్లా నాయక్‌' దర్శకుడు సాగర్‌ కె చంద్ర. అతని సినీ జీవిత విశేషాలు తన మాటల్లోనే...

అది 2009...

నేను చెప్పిన మాట విన్న అమ్మానాన్నలు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక మౌనంగా ఉండిపోయారు. కొద్దిసేపు ఆశగా చూశా ఏమన్నా మాట్లాడతారేమోనని.., ఊహూఁ, ఇక లాభం లేదని నేనే ఏదో చెప్పబోతుండగానే ‘నువ్వు ఆపరా’ అంటూ అమ్మ అందుకుంది. ‘ఉన్నట్టుండి ఈ సినిమా గోల ఏంట్రా... ఆ ఇండస్ట్రీలో మనకు తెలిసిన వాళ్లెవరూ లేరు. నా మాట విని అమెరికా వెళ్లిపో...’ అంది. ‘సినీ పరిశ్రమలో నిలబడాలంటే బ్యాక్‌గ్రౌండ్‌ ఉండాలి. మా ప్రపంచమేమో చదువూ విద్యార్థులే. నువ్వేమో డైరెక్టర్‌ అవ్వాలనుకుంటున్నావ్‌. ఇవన్నీ జరిగే పనులేనా... ’ అన్నారు నాన్న ఒకింత బాధగా, భయంగా. ఈపాటికే అర్థమై ఉంటుంది నేను అమ్మానాన్నలకు ఏం చెప్పి ఉంటానో. అమెరికాలో మాస్టర్స్‌ చేసేటప్పుడు నాకు సినిమాల మీద ఇష్టం కలిగింది. డైరెక్టర్ని అవ్వాలనే ఆలోచన బుర్రలో బలంగా నాటుకుపోయింది. అందుకే అమ్మానాన్నలు ఇష్టపడకపోయినా దైర్యంగా సినీ రంగంలో అడుగుపెట్టా. ‘అయ్యారే’ తరవాత నా రెండో సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ విడుదలయ్యాక వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది.

‘భీమ్లా నాయక్‌’ చిత్రానికి దర్శకుడిగా అవకాశం వచ్చిందన్నప్పుడు ఎంతో ఆనందపడ్డారు. ఈ ప్రయాణంలో నా గురించి చెప్పాలంటే సినిమాల్లోకి రాక ముందూ... సినిమాల్లోకి వచ్చాకా... అంటూ రెండు పార్టులుగా విభజించాలి. మొదట సినిమాల్లోకి రాకముందు జీవితం గురించి చెబుతా.

మాది నల్గొండ. మా నాన్నకి ఒక స్కూలు ఉంది. చదువు విషయంలో ఆయన చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. నేనూ బాగా చదివేవాణ్ని. నల్గొండ ప్రాంతంలో సినిమాలు అంతగా చూసేవారు కాదు. నేనూ ఎప్పుడూ ఆలోచించలేదు కూడా. అలాంటి నల్గొండలోనే ఇంటర్‌ వరకూ చదివిన నాకు ఎమ్‌సెట్‌లో 1535వ ర్యాంకు రావడంతో హైదరాబాద్‌లోని వాసవీ కాలేజీలో ఇంజినీరింగులో సీటు వచ్చింది. అప్పుడు కూడా చదువయ్యాక స్టార్టప్‌ పెట్టాలనే ఆలోచించేవాడిని. బీటెక్‌ అయ్యాక మాస్టర్స్‌ చేయడానికి అమెరికా వెళ్లా. అక్కడ మా యూనివర్సిటీలోనే ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ పక్కనే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఉంది. అక్కడకొచ్చే వాళ్లని గమనించడం, మాట్లాడటం మొదలుపెట్టా. క్రమంగా నాకూ సినిమాలపైన ఆసక్తి పెరిగింది. కానీ ఇంట్లో ఏమంటారోననే భయం మాత్రం ఉండేది. అయితే చదువు పూర్తి అయి ఉద్యోగంలో చేరాక సినిమాటోగ్రఫీతోపాటు కొన్ని కోర్సుల్లోనూ శిక్షణ తీసుకున్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఉద్యోగం మానేశా...

ఇంతలో అక్క పెళ్లి కోసం ఇంటికి రమ్మని ఫోన్‌ చేశారు అమ్మానాన్నలు. అదే మంచి అవకాశమని ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ వచ్చేశా. అక్క పెళ్లి అయిన తరవాత, నా మనసులోని మాట చెప్పా. అప్పుడే ఇంట్లో వాళ్లు సినిమా మాట ఎత్తొద్దని పట్టుబట్టారు. పైగా ప్రతిభ ఉన్నా సినీ నేపథ్యం లేక చాలామంది పరిశ్రమకు దూరమయ్యారు. అయితే ఆ సమయంలోనే- విదేశాల్లో చదువుకుని వచ్చిన రవిబాబు, శేఖర్‌ కమ్ముల, క్రిష్‌లాంటి దర్శకులు కూడా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. నాకూ అది కలిసొచ్చింది. అమ్మానాన్నలు అయిష్టంగా ఉన్నా సరే, అక్క పెళ్లి తరవాత హైదరాబాద్‌కి మకాం మార్చేశా. సినిమావాళ్లతో పరిచయాల కోసం ఎదురు చూస్తున్నప్పుడే ‘నాకు దర్శకుడు రవి బాబు తెలుసురా’ అన్నాడో ఫ్రెండ్‌. నంబరు తీసుకుని వెంటనే ఫోన్‌ చేశా. మర్నాడు ఆఫీసుకొచ్చి కలవమన్నారు. అలానే వెళ్లి ఆయన్ని కలిసి చేతిలో ఓ కాగితం పెట్టా. అది చదివి నన్ను విచిత్రంగా చూశారు. సినిమా ఆఫీసుకెళ్లి రెజ్యుమె ఇస్తే అలాకాక ఎలా చూస్తారు. నిజానికి ఆ రెజ్యుమె చూడ్డం వల్ల నేనేంటో చెప్పకుండానే అర్థమైంది. వెంటనే సహదర్శకుడిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. సినీరంగంలో అడుగుపెట్టడానికి అక్కడే పునాది పడింది. ఇక్కడి నుంచి నా సినీ జీవితం మొదలైందని చెప్పాలి. అప్పటికి ‘అమరావతి’ షూటింగ్‌ జరుగుతోంది. ఆ సినిమాకి పనిచేశా. ఆ తరవాత నేనే సొంతంగా కథ రాసుకున్నా. ఆ సమయానికి నేను డైరెక్షన్‌ చేయగలనా లేదా అన్నది మాత్రం ఆలోచించలేదు. ఇంతలో ఓ ఫ్రెండ్‌ వల్ల డాక్టర్‌ సుధాకర్‌గారు పరిచయమయ్యారు. నా దగ్గరున్న కథ చెప్పడంతో వెంటనే రెండు లక్షల రూపాయలు చేతిలో పెట్టి ‘నువ్వే నా డైరెక్టర్‌వి, రేపట్నుంచే పనులు మొదలుపెడదాం’ అన్నారు. నామీద నిర్మాత పెట్టిన నమ్మకంతో చకచకా సినిమా తీశా. అదే రాజేంద్రప్రసాద్‌గారు ప్రధాన పాత్రలో నటించిన ‘అయ్యారే’. సినిమా రేపోమాపో విడుదలవుతుంది అనుకునేలోపు ఓ సమస్య వచ్చింది. మా పోస్టర్‌ చూసిన ఓ స్వామీజీ తననే విమర్శిస్తూ సినిమా తీశాం అనుకుని హైకోర్టులో కేసు వేశాడు. దాంతో సినిమా విడుదలవకుండా వాయిదా పడింది. దాదాపు ఏడెనిమిది నెలలపాటు సెన్సార్‌ బోర్డు చుట్టూ తిరుగుతూ కోర్టులో వాయిదాలకు హాజరయ్యేవాడిని. అయినా సరే ఓపిగ్గా ఉండి సినిమాలో చెప్పిన అంశాన్ని కోర్టులో బలంగా వినిపించా. చివరికి కోర్టులో గెలవడంతో ఆ సినిమా 2012లో విడుదలైంది. నాకూ మంచిపేరును తెచ్చిపెట్టింది. ఇంట్లో వాళ్లు మొదటి సినిమా అయ్యాక కూడా భయపడ్డారు. రెండో సినిమాకి ముందు కూడా హెచ్‌ వన్‌ అప్లై చేస్తావా అన్నారు. నేను మాత్రం సినిమాలకే కట్టుబడి ఉండటంతో వాళ్ల మాట వినలేదు.

నంది అందుకున్నా...

ఆ తరవాత నటుడు శ్రీనివాస రెడ్డి ద్వారా నారా రోహిత్‌ పరిచయమయ్యాడు. అతని ద్వారా శ్రీవిష్ణు క్లోజ్‌ఫ్రెండ్‌ అయ్యాడు. ఇద్దరం కలిసి సినిమాలు చేయాలనుకున్నాం. తరచూ కలుసుకుని సినిమాల గురించే గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లం. అయితే సరిగ్గా ఆ సమయంలోనే ‘మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ప్రొఫెషనల్‌ మీడియా అండ్‌ మీడియా మేనేజ్‌మెంట్‌’ కోర్సు చేయడానికి నేను చదువుకున్న యూనివర్సిటీ నుంచి పిలుపొచ్చింది. ఆ కోర్సు చేయడానికి స్కాలర్‌షిప్పు కూడా ఇస్తారు. దాంతో వెళ్లి ఆ కోర్సు చదువుదామని నిర్ణయించుకున్నా. అందుకు శ్రీవిష్ణు ఒప్పుకోలేదు. ‘వెళితే రాలేవు. మనం ఒక సినిమా చేద్దాం. కావాలంటే చేశాక వెళ్లు’ అన్నాడు. దాంతో ఆగిపోయా. ఒకరోజు ఇద్దరం క్రికెట్‌ ఆడుతున్నాం. అప్పుడు వచ్చిన ఆలోచనతోనే క్రికెట్‌ నేపథ్యంలో కథ రాశా. అదే... ‘అప్పట్లో ఒకడుండేవాడు’. నారా రోహిత్‌, శ్రీవిష్ణుతో కలిసి తీశా. ఆ సినిమా హిట్టైంది. నాకు ఏ మాత్రం పరిచయం లేని సుకుమార్‌ సర్‌, సురేందర్‌రెడ్డి సర్‌ వంటి పలువురు దర్శకులు కూడా ఫోన్‌ చేసి మరీ అభినందించారు. అలానే స్పెషల్‌ జ్యూరీ విభాగంలో బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌కి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు నాలో ఉత్సాహాన్ని నింపింది. అమ్మానాన్నలకీ నా మీద నమ్మకం పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అదంతా అయ్యాక వరుణ్‌తేజ్‌తో ఓ సినిమా ఓకే అయింది. తీరా షూటింగ్‌ మొదలయ్యే సమయానికి బడ్జెట్‌ సమస్యతో ఆగిపోయింది. తరవాత ఇంకో సినిమా చేయబోయేలోపు కరోనా దెబ్బకి ఇంకాస్త గ్యాప్‌ వచ్చింది. కరోనా తీవ్రత తగ్గాక నిర్మాత సూర్యదేవర నాగవంశీ గారు ఫోన్‌ చేశారు. ‘సాగర్‌, మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ చూశాక నన్ను కలువు’ అన్నారు. అంతకు ముందే రానా కూడా నాకు ఫోన్‌ చేసి ఆ సినిమా చూడమని చెప్పాడు. అప్పటివరకూ వంశీగారితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. వాళ్లు చెప్పినట్టే సినిమా చూసి వెళ్లి కలిశా. నా అభిప్రాయం చెప్పా. వెంటనే ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ హక్కులు మనమే తీసుకున్నాం. తెలుగులో తీసే సినిమాకి నువ్వే దర్శకుడివి’ అని నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు. త్రివిక్రమ్‌గారు ఈ సినిమాకి సంభాషణలూ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో ఆయన్ని కలిశా. కొన్ని సూచనలు చేయడంతోపాటు ‘నువ్వు ఎవరితో సినిమా చేస్తున్నావో తెలుసా’ అన్నారు. తెలియదు అని చెప్పబోయేలోపు ‘పవన్‌కల్యాణ్‌తో...

ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు నవ్వుతూ. షాక్‌ అయ్యా. మాటల్లో చెప్పలేనంత సంతోషం. పిలిచి ఇచ్చిన అవకాశం కావడంతో నా మీద నాకు మరింత నమ్మకం పెరిగింది. పవన్‌కల్యాణ్‌, రానా, నిత్యామేనన్‌... ఇలా చాలామంది సీనియర్‌ నటీనటులు ఉండటం కూడా ఓ సవాలుగానే అనిపించింది. అలాంటప్పుడే మనలో సత్తా తెలుస్తుందని అడుగు ముందుకేశా. ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ మూలాల్ని తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాం. అలానే త్రివిక్రమ్‌ సర్‌తో కలిసి పనిచేసిన ఈ ప్రయాణంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన పనితీరునూ దగ్గరగా గమనించగలిగాను. అలానే పవన్‌సర్‌ విషయానికొస్తే ఏ ప్రాంతంలో షూటింగ్‌ ఉన్నా, టంచనుగా సమయానికి వచ్చి సెట్‌లో ఉండేవారు. గెలుపోటములు పట్టించుకోకుండా కష్టపడి పనిచేస్తారు. నన్ను కూడా అలానే ప్రోత్సహించేవారు. సినిమా మొదలైనప్పుడు ఏ ఎనర్జీతో ఉంటారో పూర్తయ్యేవరకూ అలానే ఉంటారు. రానా కూడా ఎప్పుడూ జోష్‌గా ఉంటూ సెట్‌లో ఉన్నవాళ్లని నవ్వుల్లో ముంచెత్తేవారు. వీళ్లవల్లనే సినిమాని ఎంతో ఉత్సాహంగా పూర్తి చేయగలిగాను. ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా చేయగలను అనే నమ్మకం కలిగింది. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే వాటి పనులూ మొదలవుతాయి.

షూటర్‌ కూడా...

వన్‌ సర్‌తో సినిమా చేయాలని ఎందరో దర్శకులు ఎదురుచూస్తుంటారు. అనుకోకుండానే నాకు ఆ అవకాశం వచ్చింది. ఆయనతో కలిసి ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నరపాటు ప్రయాణం చేశా. ఆయనలో పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. సెట్‌లో ఎప్పుడూ కూల్‌గా, ఉత్సాహంగా ఉంటారు. ఆయన మంచి షూటర్‌. తుపాకులంటే చాలా ఇష్టం. రకరకాల తుపాకుల గురించీ వాటి తయారీ, పనితీరు గురించి కూడా ఎంతో వివరంగా చెబుతుంటారు. నేనూ అమెరికాలో ఉన్నప్పుడు షూటింగ్‌ రేంజ్‌కి వెళ్లేవాణ్ని. ఆ విషయమే పవన్‌ సర్‌తో చెప్పినప్పుడు ‘ఎప్పుడైనా ఫుల్లీ ఆటోమేటిక్‌ ఏకే 47 ఫైర్‌ చేశావా’ అని అడిగారు. చేయలేదు అని చెప్పడంతో ‘ఒకసారి చేసి చూడు బాగుంటుంది’ అన్నారు. ఆయన చెప్పినందుకైనా కాంబోడియాలోని ఫైర్‌ రేంజ్‌కి వెళ్లి ప్రయత్నిస్తా.

బుక్స్‌ బాగా చదువుతా

నాన్న రామచంద్రారెడ్డి, అమ్మ సునీత నల్గొండలోనే ఉంటారు. అక్క గౌతమి అమెరికాలో స్థిరపడింది.

* 2017లో నా పెళ్లైంది. నా భార్య పేరు గీతా రెడ్డి. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గీత కూడా నాలాగే హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదివి మాస్టర్స్‌ కోసం విదేశాలకు వెళ్లింది. కొంత కాలం ఉద్యోగం చేసి ప్రస్తుతం విరామం తీసుకుంది.
* నాకు తెలుగు భాషపై పట్టు ఉందంటే కారణం పుస్తకాలు ఎక్కువగా చదవడమే. చిన్నప్పట్నుంచీ ఉందా అలవాటు. ఇప్పటికీ ఖాళీగా ఉంటే ఏదో ఒక పుస్తకం చదువుతా. ముఖ్యంగా నాకు ఇష్టమైన ఫిజిక్సు సబ్జెక్టుకు సంబంధించినవి ఎక్కువ తిరగేస్తుంటా.

* నేను డైరెక్టర్ని కాకపోయుంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలోనే స్థిరపడేవాడిని. ఓ స్టార్టప్‌ కూడా పెట్టి కొత్తగా ఏదైనా చేసేవాడిని.

ఇదీ చూడండి: నా జీవితం ఆ సినిమాలా ఉంటుంది​: దేవిశ్రీప్రసాద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.