తాలిబన్ల కబంధ హస్తాల్లో చిక్కిన అఫ్గానిస్థాన్‌లో తీవ్రస్థాయి (food crisis in afghanistan) ఆహార సంక్షోభం నెలకొంది. 3.9 కోట్ల అఫ్గాన్ జనాభాలో 2.28 కోట్ల మంది తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్ నుంచి అంతర్జాతీయ భద్రతా దళాలు వెనక్కి వెళ్లిపోవడం, సర్కారును తాలిబన్లు చేజిక్కించుకోవడంతో దేశంలోని వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. అంతర్జాతీయ సహాయం ఆగిపోయింది. దేశవ్యాప్తంగా నగదు కొరత నెలకొంది. నిరుద్యోగం పెరిగింది. కరెన్సీ విలువ పడిపోయింది. విదేశ మారక నిల్వలను అమెరికా, ఐఎంఎఫ్ జప్తు చేశాయి. వంటనూనె, గోధుమపిండి వంటి నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ప్రజలు పొదుపు చేసుకున్న సొమ్ములూ ఖర్చయిపోయాయి. ధరలు పెచ్చరిల్లి, నిత్యావసరాలు అడుగంటి క్షుద్భాధ తీవ్రస్థాయికి చేరింది. ప్రపంచంలోనే అతిభారీ ఆహార సంక్షోభాల్లో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. దేశంలోని రాజకీయ పరిణామాలకు వాతావరణ మార్పులు సైతం తోడై అగ్నికి ఆజ్యం పోశాయి. మూడేళ్ల వ్యవధిలో రెండు తీవ్రస్థాయి కరవు పరిస్థితులు (Afghan crisis 2021 news) అక్కడ సంభవించాయి. అఫ్గానిస్థాన్ కుప్పకూలే ముప్పు ఎదుర్కొంటున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రెస్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నాయి. చిన్నారులు సహా పెద్దసంఖ్యలో ప్రజలు ఆకలితో మరణించే పరిస్థితి నెలకొంటున్నట్లు అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కఠోరమైన శీతకాలం ఆసన్నమవుతున్న పరిస్థితుల్లో అఫ్గాన్‌లో కేవలం అయిదు శాతం కుటుంబాలకే రోజంతా తినడానికి సరిపడా ఆహార లభ్యత ఉన్నట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) సర్వే వెల్లడించింది.
తాలిబన్లు రాకమునుపు 80శాతం అఫ్గాన్ బడ్జెట్ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు సమకూర్చినదే. జీడీపీలో 40శాతం అంతర్జాతీయ సహాయమే. ఇప్పుడవన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో సహాయ సంస్థలతో సంప్రదింపులకు తాలిబన్లు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సహాయ కార్యకలాపాలకు వచ్చే సిబ్బంది గూఢచర్యానికి పాల్పడకుండా చూడటం, రాజకీయ తటస్థ వైఖరి, పన్నుల వ్యవహారం, అఫ్గాన్ సంస్కృతిని గౌరవించడం వంటి అంశాలను అది పర్యవేక్షిస్తుంది. తాలిబన్ల హింసాత్మక వ్యవహార శైలి కారణంగా సహాయ కార్యక్రమాలు చేపట్టే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ప్రమాదకరమైన ఉగ్రవాదులతో కూడిన అతివాద ఇస్లామిస్ట్ ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పరచుకోవాలా వద్దా అనే విషయంలో పశ్చిమ దేశాలు సందిగ్ధంలో పడ్డాయి. నిధుల దుర్వినియోగం, అవినీతి కార్యకలాపాలపైనా అనుమానాలున్నాయి. ఇంతకాలం విదేశాల నుంచి భారీ నిధులు రావడంతో కాంట్రాక్టర్లు, రాజకీయ నేతలు, ముఠానాయకులు కోట్లకు పడగలెత్తారు. వారి అవినీతి దేశాన్ని అతలాకుతలం చేసింది. అధికారంలోకి రాకమునుపు- దేశంలో నల్లమందు వ్యాపారం, అపహరణలు, అక్రమ గనుల తవ్వకం వంటి కార్యకలాపాలతో తాలిబన్లు సొంతంగా నిధులు సమకూర్చుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వమే సొంతమవడంతో విదేశీ నిధుల్ని ఏం చేస్తారోననే అనుమానాలున్నాయి. సహాయాన్ని నిధుల రూపంలో కాకుండా ఆహారం, మందులు తదితరాల రూపేణా అందించడం మేలనే సూచనలు వినిపిస్తున్నాయి.
అఫ్గాన్ విషయంలో ప్రపంచ దేశాలు సత్వరమే స్పందించకపోతే మరిన్ని సమస్యలు, సంక్షోభాలకు బీజాలు వేసినట్లే అవుతుంది. ఆ దేశం కోసం అవసరమైన సహాయంలో ఐరాసకు 35శాతం మాత్రమే అందుతోంది. ఛిద్రమైన అఫ్గాన్‌కు, అక్కడి నుంచి శరణార్థులు వలస వెళ్లిన పొరుగు దేశాలకు సహాయం అందిస్తామని ఈయూ ప్రకటించింది. ఆర్థిక సహాయం చేయనున్నట్లు అమెరికా, చైనాలు పేర్కొన్నాయి. విస్తృత మానవతా సహాయాన్ని అందిస్తామని భారత్ తమతో జరిగిన చర్చల్లో పేర్కొందని తాలిబన్ ప్రతినిధులు ప్రకటించారు. అఫ్గాన్‌కు సత్వరమే మానవతా సహాయం అందించాలంటూ ప్రధాని మోదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపివ్వడం స్వాగతించదగిన పరిణామం. అఫ్గాన్‌లో ఎంబసీని మూసేసిన భారత్ తన సహాయాన్ని అంతర్జాతీయ సంస్థలు, శరణార్థులకు ఆపన్నహస్తం చాస్తున్న ఇరాన్, మధ్యాసియా దేశాల ద్వారా అందించవచ్చు. సుహృద్భావ సూచనగా గోధుమలు, ధాన్యం, బిస్కెట్లు, ఇతర ప్యాకేజీ ఆహారాన్ని నేరుగా పంపే అంశాన్నీ పరిశీలించవచ్చు. అమెరికా జప్తు చేసిన నిధులనూ విడుదల చేయాల్సి ఉంది. ఏదేమైనా, ప్రస్తుతం అఫ్గాన్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాల్ని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో సహాయం అందించాల్సిన తరుణమిది. అక్కడ ప్రజాప్రభుత్వం లేకున్నా, తాలిబన్ల సర్కారును అంతర్జాతీయ సమాజం గుర్తించకపోయినా- సమస్య సామాన్యులదనే కోణంలో ఆసరాగా నిలవాలి. సంక్షోభం పెచ్చరిల్లితే పొరుగు దేశాలకు శరణార్థుల తాకిడితోపాటు, భద్రతాపరమైన కష్టాలూ తప్పవు. అఫ్గాన్ వాసుల్లో భారత్‌పై ఉన్న ప్రత్యేక ఆపేక్షను నిలుపుకొనేందుకు వైద్య, విద్యార్థి వీసాల్ని పునరుద్ధరించి, ఇతరత్రా సహాయ సహకారాల్నీ అందించాలి.
- డి.శ్రీనివాస్
ఇదీ చదవండి:Afghanistan news: మా డబ్బులు మాకివ్వండి: తాలిబన్ సర్కార్