'నేను శ్యామల కూతుర్ని..' అని పిలిపించుకోవడానికి మించిన ఆనందం మరొకటి లేదు నాకు. 'ఆమె లేకపోతే నేను లేను' ఈ మాటల్ని ఒక్కసారి కాదు.. కమలాహ్యారిస్ సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతూనే ఉన్నారు. కమల తన జీవితంలో ఎదురైన అనేక సవాళ్లకు అమ్మ శ్యామల చెప్పిన పాఠాల నుంచే పరిష్కారాలని వెతుక్కున్నారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు. తండ్రి డొనాల్డ్ హ్యారిస్ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్. ఇద్దరూ బర్కెలీ యూనివర్సిటీ విద్యార్థులు. పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. తల్లిదండ్రుల చేతులు పట్టుకుని వెళ్లి ఎన్నో ఉద్యమాల్ని చిన్నపుడే చూసింది కమల. 'ఇతరుల కోసం పనిచేయడంలోనే జీవితానికి ఒక ప్రయోజనం, అర్థం ఉంటాయి అని అమ్మ ఎప్పుడూ అంటుండేది' అని చెప్పే కమల... ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక 'అమ్మ ఈ విషయాన్ని ఊహించి ఉండదు. కానీ ఆరోజు రావాలని గట్టిగా కోరుకునేది' అన్నారు. శ్యామల దిల్లీలో చదువుకుంటూ మహిళాహక్కుల కోసం పోరాడారు. తండ్రి పీవీ గోపాలన్ స్వతంత్ర సమరయోధుడు. ఆయన పంచిన పోరాట స్ఫూర్తిని వెంటపెట్టుకుని పందొమ్మిదేళ్ల వయసులో శ్యామల అమెరికాలో అడుగుపెట్టారు.
న్యూట్రిషన్ అండ్ ఎండోక్రెనాలజీలో డాక్టరేట్ చేయాలనేది ఆమె కల. అక్కడ సమాజంలో ఆమెకు ఎదురైన వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా తోటి విద్యార్థులతో కలిసి పోరాడుతున్న సమయంలోనే హ్యారిస్‌ను కలిశారు. సంప్రదాయాలని ఎదిరించి అతన్ని పెళ్లిచేసుకున్నారు. ఆ బంధం ఏడేళ్లకే ముగిసిపోయినా ధైర్యంగా తన ఇద్దరాడపిల్లలు కమలాదేవి, మాయా లక్ష్మిలను తీసుకుని వాళ్లలో పోరాట స్ఫూర్తిని నింపారు. 'మా అమ్మనాన్న నాకు ఏడేళ్లుండగా విడిపోయారు. కోర్టులో వాళ్లిద్దరూ వాదించుకున్నది డబ్బుకోసం కాదు... పుస్తకాల కోసం. మా అమ్మ పొడగరి. మహా ధైర్యవంతురాలు. పని అంటే ప్రాణం పెడుతుంది. అమ్మ రీసెర్చ్ పనిలో ఉండగా అనుకోకుండా ఉమ్మనీరు బయటకు రావడంతో డెలివరీ చేసి నన్ను తీశారట.
నాన్న దూరమయ్యాక... అమ్మ ఎన్నో కష్టాలకు ఓర్చుకుని మమ్మల్ని పెంచింది. ఓ మధ్యతరగతి భారతీయ కుటుంబంలానే ఉండేది మా ఇల్లు. దుస్తులు, ఆహారం అన్నీ భారతీయ పద్ధతిలోనే ఉండేవి. ఇడ్లీ, వడ, సాంబార్ నా ఫేవరెట్ ఆహారం. అమ్మలో రెండు భిన్నమైన తత్వాలుండేవి. పరిశోధనలూ, పౌరహక్కులూ అంటూ... మాలో చైతన్యాన్ని నింపిన అమ్మ మరోపక్క తన మూలాలని ఏమాత్రం మరిచిపోలేదు. తమిళనాడులోని తన పుట్టింటికి తీసుకెళ్లి నాకు మావయ్య, అత్తయ్య, పిన్ని వీళ్లందరినీ పరిచయం చేసింది. భారతీయ మూలాలు ఉన్నందుకు గర్వంగా ఉండమని చెప్పేది అమ్మ. నేను ఇప్పటికీ మా పిన్నిని 'చిత్తీ' అనే పిలుస్తాను. తమిళంలో చిత్తీ అంటే పిన్ని అని అర్థం. వీలు చిక్కినప్పుడల్లా తన ల్యాబ్‌కి నన్నూ, చెల్లిని తీసుకెళ్లేది. అక్కడ టెస్ట్‌ట్యూబ్‌లని శుభ్రం చేయడం నా పని. ఎప్పుడైనా అమ్మకు పనిపడి దూరప్రాంతం వెళ్లాల్సి వస్తే... నన్నో డేకేర్ సెంటర్‌లో పెట్టేది. అక్కడ గోడలపై ఆఫ్రికా- అమెరికా నాయకుల చిత్రాలు ఉండేవి. వాటిని చూస్తూనే పెరిగాను. అమ్మతో మా అక్కాచెల్లెలని చూసినవాళ్లంతా 'శ్యామల అండ్ ద గర్ల్స్' అని మురిపెంగా పిలిచేవారు' అంటూ కమల ఎన్నికల సమయంలో తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు.

కమల తల్లి శ్యామల తన ప్రత్యేకమైన యాస, రంగువల్ల కెరీర్‌లో అనేక ఇబ్బందులని ఎదుర్కొన్నారు. ఆ అసమానతలకు వ్యతిరేకంగా పౌరహక్కులకోసం జీవితాంతం పోరాడుతూనే ఉన్నారు. క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న శ్యామల అదే క్యాన్సర్‌కి గురికావడం విచారకరం. 2009లో శ్యామల చనిపోయాక... తల్లి కోరికమేరకు, ఆమె చితాభస్మాన్ని బంగాళాఖాతంలో కలపడానికి వచ్చారు కమల.

వినాయకుడికి 108 టెంకాయలు
తాతయ్య పీవీ గోపాలన్, అమ్మమ్మ రాజంల ప్రభావం తనమీదా ఉందని చెబుతారు కమల. గోపాలన్... సివిల్ సర్వెంట్. రాజం... బడికెళ్లి చదువుకోకపోయినా, ఇరుగుపొరుగు మహిళల హక్కుల కోసం పోరాడేవారు. చెన్నై వచ్చినపుడు మెరీనా బీచ్‌లో తాతయ్యతోపాటు వాకింగ్‌కి వెళ్తూ వారి స్నేహితులు ప్రజాస్వామ్యం, హక్కుల గురించి చర్చించుకుంటుంటే ఎంతో శ్రద్ధగా వినేవారట కమల.
చెన్నైలోని బీసెంట్ నగర్‌లో ఉండే వరసిద్ధి వినాయక ఆలయం నిర్మాణ కమిటీలో శ్యామలా గోపాలన్ సభ్యురాలు. తొమ్మిదేళ్ల కిందట కమల కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పోటీ చేసినపుడు... పిన్ని సరళాకు ఫోన్ చేసి ‘చిత్తి... నాకోసం ప్రార్థించండి. వినాయకుడి గుడిలో కొబ్బరి కాయలు కొట్టండి’ అని అడిగారు. దాంతో సరళ 108 కొబ్బరికాయలు కొట్టారు. 2016లో సెనేటర్‌గా పోటీచేసినపుడూ కమల కోరికమేరకు సరళ మరోసారి 108 కొబ్బరి కాయలు కొట్టారు. ఈసారి ఆమె కోరకపోయినా సరళ ఆ పనిచేస్తున్నారు.
కమలా అమ్మమ్మ అయింది!
కమలాదేవి హ్యారిస్

కమల ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతోందని తెలియగానే ఆమె ప్రచార బృందంలో చేరి చురుకైన పాత్ర పోషించారు చెల్లెలు మాయలక్ష్మి. 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసినప్పుడూ మాయ కీలకంగా వ్యవహరించారు. కమల విజయంలో మాయా పాత్ర కూడా ఎంతో ఉంది. మాయ... లాయర్, పౌర హక్కుల ఉద్యమకారిణి, రచయిత కూడా. క్రిమినల్ జస్టిస్ వంటి కొన్ని అంశాల్లో ఒకరినొకరు విభేదించుకున్నా... అంతకంటే ఎక్కువగా ఒకరికోసం మరొకరు నిలబడతారు.
అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్’ నాయకురాలిగా, ఫోర్డ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్‌గానూ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న మాయకు మనుమలు కూడా పుట్టేశారు. కమల ఏ కాస్త తీరిక దొరికినా మాయ మనవరాళ్లతో సరదాగా గడుపుతుంటారు.
మనసుమాటే వినండి...
మహిళలూ... మీరు నాయకత్వం వహించే విషయంలో ఎవరి అనుమతులూ తీసుకోవాల్సిన అవసరంలేదు. నాకూ చాలామంది... ‘ఇది నీ సమయం కాదు’, ‘ఈసారి తప్పుకోవడం మంచిది...’ ఇలా చాలా సలహాలు ఇచ్చారు. కానీ నేను నా మనసు మాటే విన్నాను.
కాన్వర్స్‌తో ఉత్సాహంగా...
ప్రయాణాల్లో కాన్వర్స్ స్నీకర్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు. చక్ టేలర్స్ బ్రాండ్ స్నీకర్స్ పదుల సంఖ్యలో ఆమె దగ్గర ఉన్నాయి. ఎన్నికల ప్రచారం మొత్తం ఆమె కాన్వర్స్ వేసుకునే కనిపించారు.
చదువు- కెరీర్..
తల్లి కెనడాలోని మెక్‌గిల్ యూనివర్సిటీలో కొన్నాళ్లు పరిశోధకురాలిగా, బోధకురాలిగా పనిచేయడంతో కమల స్కూలింగ్ అక్కడే జరిగింది. హార్వర్డ్‌లో ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆపైన బర్కెలీ నుంచి ‘లా’ చేశారు. తర్వాత ఓక్లాండ్‌లో ప్రాసిక్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు.
2004లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ హోదాలో కూర్చొన్న మొదటి నల్లజాతి మహిళ.
2011లో కాలిఫోర్నియా రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా అటార్నీ జనరల్‌గా, అదే రాష్ట్రం నుంచి 2016లో సెనేట్‌కు ఎంపికయ్యారు.
వారికి 'మామల'...
భర్త డగ్లస్‌తో

కమల భర్త డగ్లస్ ఎంహాఫ్... న్యాయవాది. స్నేహితులు ఏర్పాటు చేసిన బ్లైండ్ డేట్‌లో కలుసుకున్న ఏడాది తరువాత వారు పెళ్లి చేసుకున్నారు.
'నా భర్త డగ్.. మాకు రత్నాల్లాంటి పిల్లలు ఎల్లా, కోల్' అంటూ తన కుటుంబం గురించి చెబుతుంటారు కమల.
2014లో చెల్లెలు మాయ దగ్గరుండి డగ్లస్, కమలాల పెళ్లి చేసింది. డగ్ పిల్లలు కమలను సవతి తల్లిగా పిలవడానికి ఇష్టపడలేదు. అందుకే 'మామల' అని పిలుస్తారు. మామ్, కమల పదాల కలయికే మోమల. 'మామలాని మొదటిసారి చూసినప్పటి నుంచే తనని ఇష్టపడటం ప్రారంభించాం. వంటలు, సంగీతం... వంటి విషయాల్లో ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకున్నాం. తను చాలా సరదా వ్యక్తి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ ఫేస్‌టైమ్‌ద్వారా మాకోసం కొంత సమయాన్ని కేటాయించేవారు’ అంటారు వారిద్దరు. అంతేకాదు డగ్స్ మొదటి భార్యతోనూ కమలకు సత్సంబంధాలే ఉన్నాయి.
వర్క్ ఫస్ట్... వంట సెకండ్!
వంట చేస్తున్న కమలాదేవి

పని తర్వాత కమల అమితంగా ఇష్టపడే అంశం... వంట చేయడం.
తేలిగ్గా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటారు కమల. ఎక్కువగా 'రైజిన్ బ్రాన్'ని బాదం పాలతో కలిపి తీసుకుంటారు. అదీ వంటగదిలో నిల్చొనే తినేస్తారు. 'ఆదివారం కుటుంబ సభ్యులకు డిన్నర్ వండిపెట్టినపుడు ఇల్లాలిగా ఎంతో సంతృప్తి ఉంటుంది. వంట చేస్తున్నానంటే, నా జీవితం నా నియంత్రణలోనే ఉందన్న ధీమా వస్తుంది' అని చెప్పే కమల పిల్లల కోసం తరచూ కొత్త వంటకాలు ప్రయత్నిస్తారు. ఇంట్లో వంటల పుస్తకాలు చదువుతుంటారు.
భారతీయ వంటకాల్లో ఇడ్లీ-సాంబార్, 'టిక్కా' నచ్చుతాయని చెబుతారు. ఆదివారం డిన్నర్‌కి భారతీయ బిర్యానీ ఉంటే ఇష్టం. వంటల్లో భారతీయులు ఉపయోగించే సుగంధ ద్రవ్యాల గురించి అమ్మ దగ్గరే తెలుసుకున్నారు కమల. చెన్నై వచ్చినపుడు వత్తకుళంబు(కొమ్ము సెనగల కూర), నిమ్మకాయతో చేసే రసం ఇష్టపడేవారు.
ఇదీ చదవండిః చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు.. రచయితగానూ గుర్తింపు