యూఎక్స్ డిజైనర్ మాన్సీకి ట్రెక్కింగ్ గురించిన అవగాహనే లేదు. 2017లో ఓరోజు ఈమె స్నేహితుడు హేమల్ తన ట్రెక్కింగ్ షో కోసం అమ్మాయి ఎవరూ దొరకడం లేదని వాపోయాడు. అతనికి సాయం చేయాలనే ఉద్దేశంతో మాన్సీ ఆ షోలో చేస్తానంది. దానికి శిక్షణ నిమిత్తం మనాలీ వెళ్లింది. కొండా కోనలూ, పచ్చదనం ఆమెను ఆకర్షించాయి. అది మొదలు.. మరుసటి ఏడాది నుంచి మాన్సీ కూడా పార్ట్‌టైమ్ ట్రెక్ లీడర్‌గానూ అతనితో పాటు పనిచేసింది. ఈ మూడేళ్లలో మనాలీ, కాసోల్, పవగథ్ పర్వతాలు, సపుతారాల్లో బృందాలను ముందుండి నడిపించింది. లాక్‌డౌన్ లేకపోతే మరింత ఎక్కువగా చేసే వాళ్లమంటోంది 25 ఏళ్ల మాన్సీ. ‘నేను లీడ్ చేసిన వాటిలో సపుతారా పర్వతాల ట్రెక్ కొంచెం సవాళ్లతో కూడుకున్నది.
స్నేహితుడికి సాయం చేద్దామని: మాన్సీ దవే
ఐదుగురం వెళ్లాం. అక్కడికి వెళ్లాక చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు చెప్పారు. దీంతో ఆయుధాలనూ తీసుకెళ్లాం. రాత్రులు ముగ్గురు పడుకుంటే ఇద్దరం కాపలా కాసేవాళ్లం. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదాలూ ఎదురవలేదు. ఇప్పుడు లేహ్, లద్దాఖ్‌కు ప్లాన్ చేస్తున్నాం. ఎక్కువ మంది అమ్మాయిలను ట్రెక్కింగ్ దిశగా నడిపించాలనుకుంటున్నా’ అంటోందీ గుజరాతీ అమ్మాయి.
ఇదో థెరపీ: తాన్యా గిన్వాలా
క్లినికల్ సైకాలజిస్ట్‌గా తాన్యాకి ఐదేళ్ల అనుభవముంది. గదిలో నాలుగు గోడల మధ్య మానసిక సమస్యలకు పరిష్కారం చూపలేమన్నది ఆమె భావన. అప్పుడే అడ్వెంచర్ థెరపీ గురించి తెలుసుకుంది. సంబంధిత కోర్సులతోపాటు ట్రెక్కింగ్ అండ్ మౌంటెనీరింగ్‌లో సర్టిఫికేషన్‌నూ చేసింది. ఓ ఎన్‌జీఓతో కలిసి అంగవైకల్యం ఉన్న వారినీ ట్రెక్కింగ్, మారథాన్లకు తీసుకెళ్లేది. ఈ అనుభవంతో ఏడాది నుంచి అడ్వెంచర్ థెరపీ ట్రెక్కింగ్‌ని ప్రారంభించింది.
ప్రాక్టీస్‌నూ పుణె నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు మార్చింది. ‘సాధారణ థెరపీనే ప్రకృతి ఒడిలో కొండలు, పర్వతాల మధ్య అందిస్తాను. వీళ్లతో మాట్లాడుతూ, వాళ్ల పరిస్థితిని అంచనా వేస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలి కాబట్టి, మామూలుగా వెళ్లే వాళ్లతో పోలిస్తే ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కొక్కరి వీలునుబట్టి రెండు నుంచి పది రోజుల వరకూ ట్రెక్ నిర్వహిస్తాను’ అంటోంది తాన్యా.
సైనికులకీ శిక్షణ: ఇషానీ సావంత్
13 ఏళ్ల వయసులో అనుకోకుండా హిమాలయాల ట్రెక్కింగ్‌కు వెళ్లింది. అది బాగా నచ్చడంతో తెలిసిన వాళ్లు వెళుతున్నారంటే చాలు కలిసి వెళ్లిపోయేది. అడ్వాన్స్‌డ్ మౌంటెనీరింగ్ కోర్సులను చేసింది. అమెరికన్ మౌంటెయిన్ గైడ్స్ అసోసియేషన్ నుంచి సర్టిఫికేషన్‌నూ చేసింది. దీని వల్ల శిక్షణనిచ్చే అర్హతా దక్కింది. ఏటా మన దేశంతోపాటు యూఎస్, హాంకాంగ్‌ల్లోనూ ట్రెక్కింగ్ నిర్వహిస్తోంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో రాక్ క్లైంబింగ్‌పై శిక్షణనూ ఇస్తోంది.
తను ఎక్కిన పర్వతాల్లో 6443 మీటర్ల ఎత్తున్న మెంతోసా చాలా కష్టమైందంటుంది ఇషానీ. ‘స్వయంగా చేయడంతోపాటు లీడ్ చేస్తున్నా కూడా. ఈ పదేళ్లలో ఎన్ని ట్రెక్స్ నిర్వహించానో లెక్క కూడా మర్చిపోయాను. ఓసారి శిక్షణ ఇవ్వడానికి వెళితే నాకేమీ రాదనుకుని ఎగతాళి చేశారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ల అభిప్రాయం తప్పని ఒప్పుకున్నారు. అమ్మాయిలు ఇంతేసి దూరాలు నడవడం, ఎక్కడం కన్నా... ఇలాంటి అభిప్రాయాలకు సమాధానమివ్వడానికి ఎక్కువ కష్టపడుతున్నారు’ అంటోంది 30 ఏళ్ల ఇషానీ.
ఇదీ చదవండి: Cloud kitchens: క్లౌడ్ కిచెన్లు.. విస్తరిస్తున్న కొత్తరకం ఉపాధి