చర్మం, జుట్టు సంరక్షణ ఇలా!
- హోలీ ఆడటానికి కేవలం సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలి. అయితే నేచురల్ రంగులుగా మార్కెట్లో దొరుకుతున్న చాలా రకాల రంగుల్లో రసాయన అవశేషాలుంటున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉదాహరణకు హెన్నాను మనమంతా సహజసిద్ధమైన రంగుగానే భావిస్తాం.. కానీ బ్లాక్ హెన్నాలో పారాఫినైలెన్డయమిన్ (పీపీడీ) అనే రసాయనం కలిసి ఉంటుంది. అది చాలామందిలో ఎలర్జీని కలగజేస్తుంది.
- హోలీ ఆడటానికి ముందే గోళ్లకు దట్టంగా నెయిల్ పాలిష్ వేసేయాలి. దీని వల్ల గోళ్లలోకి రంగుల ప్రభావం పోకుండా ఉంటుంది. లేదా కొబ్బరి నూనె, ఆముదం, ఆలివ్ ఆయిల్ చెంచా చొప్పున తీసుకొని అందులో గోళ్లను ముంచి కాసేపు ఉంచాలి.
- హోలీ ఆడే క్రమంలో ఎండ తగులుతుంది. కాబట్టి చర్మం మరింత నల్లబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ముందుగానే చర్మానికి 30 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలి.
- పెదాలకు లిప్‌బామ్‌ని దట్టంగా రాసుకోవాలి. హోలీ ఆడిన తర్వాత లిప్ బామ్ కూడా పోయేలా పెదవుల్ని కడిగి తుడుచుకోవాలి.
- హోలీ రంగుల వల్ల చర్మం తర్వాత ఎక్కువగా పాడయ్యేది జుట్టు.. అందుకే హోలీకి ముందు రోజు రాత్రే తలకు నూనె పట్టించి మర్దనా చేయాలి. హోలీ ఆడేటప్పుడు కూడా గట్టిగా జడ వేసుకోవడం వల్ల జుట్టు పైన ఎక్కువగా రంగు పడకుండా ఉంటుంది.
- తలలో చుండ్రు, ఇతరత్రా సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. హోలీ ఆడే సమయంలో తలకు ఏదైనా క్లాత్ కట్టుకోవడమో, క్యాప్ పెట్టుకోవడమో చేయాలి.
- హోలీ ముందు రోజు శరీరానికి ఆముదం రాసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం లోపలికి వెళ్లకుండా ఉండటమే కాదు.. రంగులు తొందరగా తొలగిపోతాయి.
- హోలీ ఆడిన తర్వాత కూడా క్లెన్సర్‌తో చక్కగా రంగులను క్లీన్ చేసుకోవాలి. ఎక్కడా రంగుల అవశేషాలు మిగలకుండా జాగ్రత్త పడాలి. ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్ల పాలపొడి, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ తీసుకొని దాన్ని చర్మానికి పట్టించి క్లీన్ చేసుకుంటే రంగులు ఈజీగా తొలగిపోతాయి. ఆ తర్వాత శరీరానికి మంచి మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాసుకోవాలి.
- హోలీ ఆడిన తర్వాత ముల్తానీ మట్టి ప్యాక్ వేసుకొని ఒక గంట సేపు ఆగిన తర్వాత స్నానం చేయడం వల్ల రంగులన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ రంగుల వల్ల అలర్జీలు తలెత్తకుండా ఉంటాయి.
- శెనగపిండి, ఆలివ్ ఆయిల్, మీగడ, రోజ్‌వాటర్‌లతో చిక్కని పేస్ట్ తయారుచేసి ముఖం, చేతులు, మెడ, కాళ్ల మీద అప్త్లె చేసి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత రుద్ది కడిగేసుకుంటే చర్మం మీద వచ్చిన దద్దుర్లు తగ్గుతాయి.
- హోలీ ముందు లేదా తర్వాత కొద్ది రోజుల పాటు బ్యూటీ ట్రీట్‌మెంట్లకు దూరంగా ఉండడం మంచిది.
- హోలీ ఆడే క్రమంలో శరీరాన్ని పూర్తిగా కవర్ చేస్తూ ఉండే దుస్తులు ధరించడం మంచిది. దీనివల్ల చర్మానికి రంగుల వల్ల ఎక్కువ హాని జరగకుండా కాపాడుకోవచ్చు.
కళ్లు జాగ్రత్త!
- హోలీ రంగుల నుంచి కళ్లను కాపాడుకోవడం కూడా ముఖ్యమే. ఈ క్రమంలో కళ్లలో రంగులు పడినట్లయితే వాటిని ఎక్కువ నీళ్లతో తరచుగా కడుగుతూ ఉండాలి. హోలీ ఆడడం పూర్తయిన తర్వాత కళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని పడుకున్నా కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది.
- మన కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. వీటిపై రంగులు పడితే అది కమిలిపోయి ఆ ప్రభావం కంటి చూపుపై పడుతుంది. అందుకే హోలీ ఆడే ముందే కొబ్బరి, బాదం నూనెలను కళ్ల చుట్టూ రాసుకోవాలి.
- ఒకవేళ కళ్లు ఎర్రబడటం, నీరు కారడం, పుసులు కట్టడం, దురద, రక్తం కారటం లాంటి లక్షణాలు కన్పిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా తక్షణం నిపుణులైన నేత్ర వైద్యులను సంప్రదించాలి.
- కంట్లో రంగులు పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎవరైనా రంగులు వేస్తే కళ్లు, పెదాలు గట్టిగా మూసి వేయడం ద్వారా ప్రమాదం నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు.
- కళ్లలో రంగులు పడితే ఎట్టి పరిస్థితిలో నలపకూడదు. ఇలా చేయడం వల్ల నేత్రాలకు మరింత నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు చూపు కోల్పోయే అవకాశం కూడా ఉంది.
- వాటర్ బెలూన్స్‌కు దూరంగా ఉండాలి. వీటితో కళ్లలోకి కొట్టడం ద్వారా ఎక్కువ గాయాలవుతాయి. కొన్నిసార్లు కళ్లల్లో రక్తస్రావం జరుగుతుంది. కటకాలు దెబ్బతినడం, స్థానభ్రంశం చెందడం, రెటీనా దెబ్బతినే ముప్పు ఉంటుంది. కళ్లలో చిక్కుకున్న అవశేషాలను చేతి రుమాలు, టిష్యూ పేపర్ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తే అది మరింత నష్టం కలిగిస్తుంది.
- హోలీలో పాల్గొంటే కాంటాక్ట్ లెన్స్‌లు వాడకపోవడం ఉత్తమం. కొన్ని లెన్స్‌లు నీటిని పీల్చుకుంటాయి. ఇవి కంటిలో చిక్కుకుపోతే అలర్జీలు, అంటు వ్యాధులు రావడంతో పాటు కంటి చూపుకి నష్టం చేసే అవకాశం ఉంది.
- డాబాలు, మేడలపై, అపార్ట్‌మెంట్ల టెర్రస్‌పై హోలీ ఆడకపోవడం మంచిది. కొన్నిసార్లు ఈ సందడిలో మునిగి కాలు జారి కింద పడే ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో ఈ తరహా సంఘటనలు చోటుచేసుకున్నాయి.
- ప్రమాదవశాత్తు రంగు పడితే ముఖాన్ని కిందకు దించి కళ్లను తెరిచేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో కళ్లల్లో నీళ్లు కొట్టకూడదు. ఇది మరింత ప్రమాదానికి దారితీస్తుంది. దోసిట్లో నీటిని తీసుకొని అందులో ముఖం పెట్టి కళ్లను నెమ్మదిగా తెరవాలి.
కరోనా నుంచి కాపాడుకుంటూ!
కరోనా తగ్గిపోయిందనుకుంటున్నా మళ్లీ కొన్ని దేశాల్లో విజృంభిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో- ఎక్కువమంది గుంపులుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లకపోవడమే మంచిది. అలాగే- ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రంగా ఉంచుకుంటూ, మాస్కులు ధరించడం ఉత్తమం. హోలీ సందర్భంగా వందలాది మంది ఒకేచోట గుమిగూడడం, కొన్ని ఈవెంట్ సంస్థలు ఏర్పాటు చేసే రెయిన్ డ్యాన్స్.. వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో కుటుంబంతో కలిసి పాల్గొని ఎంజాయ్ చేయడం సర్వసాధారణమే. అయితే ఎక్కువమంది గుమిగూడిన చోట వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని, ఒకవేళ ఆ గుంపులో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారు దగ్గడం, తుమ్మడం వల్ల అది మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోలీ సంబరాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించడం, ముక్కు, ముఖం కవరయ్యేలా మాస్క్‌ను ధరించడం ఇప్పటికీ అవసరమే.
ఇవీచూడండి: