తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 తులాల బంగారు, 4కిలోల వెండి, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన ఉమామహేశ్వరరావు..గత 20 ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన చోరీల్లో పట్టుబడి పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు.
ముగ్గురితో ముఠా..
నెల రోజుల క్రితం చిన్న చౌక్ పోలీసులు అరెస్ట్ చేసి కడప జిల్లా జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటికి వచ్చిన వెంటనే మళ్లీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. గుంటూరుకు చెందిన కిరణ్, కృష్ణా జిల్లా చిలకలపుడికి చెందిన ఆరేపల్లి దుర్గారావుతో కలిసి ఉమామహేశ్వరరావు ముఠా ఏర్పాటు చేశాడు.
సీసీ కెమెరాల సాయంతో..
ముగ్గురు కలిసి లాడ్జ్‌లలో బస చేస్తారు. పగటిపూట కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని.. రాత్రిపూట తాళం పగులగొట్టి.. చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సీసీ కెమెరాలు, సాంకేతక పరిజ్ఞానంతో నేరాల దర్యాప్తు చేపట్టామని సీపీ వివరించారు. హైదరాబాద్‌లో ఇప్పటికే 3.62 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
ఇవీ చూడండి: పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...