Monkeypox Vaccine కరోనా మహమ్మారితో వణికిపోయిన ప్రపంచాన్ని ఇప్పుడు మంకీపాక్స్ ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే 92 దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. 35 వేల మందికి సోకింది. వీరిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గత వారంలోనే దాదాపు 7,500 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. అంతకుముందు వారంతో పోల్చితే.. 20 శాతం మేర కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ వ్యాధి వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని గత నెల ప్రజారోగ్య అత్యయిక స్థితిని కూడా ప్రకటించింది. ఈ క్రమంలో టీకా గురించి చర్చ నడుస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. మంకీపాక్స్ టీకాలు 100 శాతం ప్రభావం చూపుతాయని ఆశించలేమని వెల్లడించింది. అందుకే జాగ్రత్తలు పాటించే విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించింది.
''మేము బ్రేక్‌థ్రూ కేసులను పరిశీలించడం మొదలుపెట్టినప్పుడు మాకు కీలక సమచారం లభించిందన్నది వాస్తవం. ఎందుకంటే.. నివారణకు లేదా వైరస్ సోకిన తర్వాతగానీ టీకాలు నూరుశాతం ప్రభావవంతం కాదని తెలుస్తోంది.'' అని ఆరోగ్య సంస్థ వెల్లడించింది. స్మాల్‌పాక్స్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను డెన్మార్క్‌కు చెందిన బవారియన్ నార్డిక్ అనే సంస్థ తయారు చేసింది. అయితే, మంకీపాక్స్‌కు ప్రత్యేకంగా వ్యాక్సిన్ లేనప్పటికీ స్మాల్‌పాక్స్‌కు అందుబాటులో ఉన్న టీకానే మంకీపాక్స్ నిరోధానికి ఆయా దేశాలు అనుమతి ఇస్తున్నాయి.
Monkeypox Spread Reason: ఈ వ్యాప్తికి ఉత్పరివర్తనలు కారణమా అనే ప్రశ్నపై ఆరోగ్య సంస్థ స్పందించింది. 'ఈ జన్యుమార్పుల ప్రభావం గురించి సమాచారం తెలియాల్సి ఉంది. వైరస్ వ్యాప్తి, వ్యాధి తీవ్రతలో ఈ ఉత్పరివర్తనల ప్రభావం ఏమేరకు ఉందనేదానిపై పరిశోధనలు సాగుతున్నాయి. ప్రస్తుత ఇన్ఫెక్షన్లకు జన్యుమార్పులు లేక హోస్ట్ ఫ్యాక్టర్స్ కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది' అని పేర్కొంది. ప్రస్తుతం మంకీపాక్స్‌లో కాంగో బేసిన్ (మధ్య ఆఫ్రికా), పశ్చిమ ఆఫ్రికాకు చెందిన రెండు వేరియంట్లు ఉన్నాయి. ఆరోగ్య సంస్థ వాటిని Clade I, Clade II గా పిలుస్తోంది. Clade IIలో IIa, IIb అనే ఉప వర్గాలున్నాయి. ప్రస్తుత వ్యాప్తికి ఇవి దోహదం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది.
Monkeypox India Cases: భారత్‌లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. వ్యాప్తి నివారణకు ఏం చేయాలో, బాధితులతో ఎలా ఉండాలో వివరిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. మంకీపాక్స్ బాధితులను తాకినా, దగ్గరగా ఉన్నా వ్యాధి సోకే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాబట్టి వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచాలని కోరింది. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు.. బాధితులను ఐసోలేషన్‌లోనే ఉంచాలని సూచించింది.
'బాధితులపై వివక్ష చూపకూడదు'.. మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, వాడే టవళ్లు, పడుకునే మంచాన్ని కుటుంబంలో ఇతరులు వాడకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగిలిన కుటుంబ సభ్యుల దుస్తులతో కాకుండా ప్రత్యేకంగా శుభ్రం చేయాలని సూచించింది. మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదని కోరింది. తప్పుడు సమాచారం నమ్మి.. బాధితులపై వివక్ష చూపరాదని కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు జారీచేసింది.
ఇవీ చూడండి: 'మగవారూ.. శృంగార భాగస్వాములను తగ్గించుకోండి'