బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని వారాల్లోనే లిజ్ ట్రస్ తీసుకున్న నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. ట్రస్ నిర్ణయాలతో సొంతపార్టీ సభ్యుల నుంచే ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తొలిసారి స్పందించిన లిజ్ ట్రస్.. తాము తప్పిదాలు చేశామని అందుకు క్షమించాలని కోరారు. తాను ఎక్కడికీ వెళ్లనని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ కన్జర్వేటివ్ పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలలోపు ప్రధాని ట్రస్‌పై అవిశ్వాసం పెట్టేందుకు పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో లిజ్ ట్రస్ స్పందించారు.
తాము తప్పులు చేసిన విషయాన్ని గుర్తించానని వెల్లడించిన లిజ్ ట్రస్.. ఆ తప్పిదాలను ఇప్పటికే సరిచేసుకున్నట్లు తెలిపారు. కొత్త ఛాన్సలర్‌ను నియమించామని.. ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించామని వెల్లడించారు. ఇలాగే ముందుకు వెళ్తూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తామన్న బ్రిటన్ ప్రధాని.. 2019 మేనిఫెస్టో ఆధారంగా మేం ఎన్నికయ్యామని.. వాటిని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామన్న లిజ్.. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ పరిస్థితులూ ప్రతికూలంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇటువంటి సమయంలో ఇంధన ప్యాకేజీపైనా దృష్టి పెట్టామని వివరించారు.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఇటీవల ప్రకటించిన మినీ బడ్జెట్లో సామాన్య ప్రజలతో సమానంగా ధనిక వర్గాలకూ ఇంధన రాయితీ ఇవ్వడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడడం వల్ల సొంత పార్టీ నేతల నుంచే ఆమెకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఘటనల నేపథ్యంలో ట్రస్‌పై ఈ నెల 24లోగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పాలక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవీ చదవండి: బ్రిటన్ ఆర్థిక మంత్రికి ఉద్వాసన.. కొత్తగా జెరెమీ హంట్ ఎన్నిక
'ట్రస్‌ను ఎన్నుకొని తప్పుచేశాం'.. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. సునాక్‌కు మరో ఛాన్స్!