Israel Hamas War : ఉత్తర గాజాను ఖాళీ చేసి దక్షిణ గాజాలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని పాలస్తీనీయులను హెచ్చరించిన ఇజ్రాయెల్.. భూతల దాడులకు సిద్ధమవుతోంది. గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆ దేశ రక్షణ శాఖ మంత్రి యొవ్ గాలంట్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఇజ్రాయెల్ సైన్యంతో జరిగిన సమావేశం అనంతరం ఈ మేరకు సందేశం ఇచ్చారు. 'ఇప్పుడు గాజాను దూరం నుంచి చూస్తున్న వారంతా.. త్వరలోనే గాజా లోపలి భూభాగాన్ని చూస్తారు. నేను మీకు మాటిస్తున్నా. లోపలికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి' అని పేర్కొన్నారు.
Israel Palestine War : మరోవైపు, దక్షిణ గాజాపైనా వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. గాజాపట్టీలోని వందలాది ప్రాంతాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇప్పుడు 20 లక్షల మందికిపైగా పాలస్తీనీయులకు గాజాస్ట్రిప్‌లో సురక్షిత ప్రాంతమంటూ లేకుండా పోయింది. వారంతా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణంపై గురువారం ఇజ్రాయెల్ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఉత్తరగాజా నగరాన్ని వీడిన 10 లక్షల మందికిపైగా ప్రజలు దక్షిణగాజాలో తలదాచుకుంటున్నారు. ఐరాస పునరావాస శిబిరాలు లక్షలాది మందితో నిండిపోయాయి.
ఒక్కపూట భోజనం.. మురుగునీటితో జీవనం
విదేశీ సాయం అందకపోవడంతో గాజాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. నీరు, ఇంధనం కూడా వారికి లేకుండా పోయింది. గాజా వాసులంతా ఒకపూట ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు. మంచి నీటి కొరత కారణంగా మురుగు నీటిని తాగి బతుకుతున్నారు. విదేశాల నుంచి వచ్చే సహాయ సామగ్రి కోసం వారంతా వేచి చూస్తున్నారు. గాజాలోని అనేక బేకరీలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసినట్టు హమాస్ మిలిటెంట్ సంస్థ ఆరోపిస్తోంది. దీనివల్ల ప్రజల కోసం ఆహారం తయారు చేయడం కష్టంగా మారినట్లు తెలిపింది.
మరోవైపు హమాస్‌కు చెందిన టాప్ మిలిటెంట్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. హమాస్ సొరంగాలను, నిఘా మౌలిక సదుపాయాలను, కమాండ్ సెంటర్లను ధ్వంసం చేసినట్లు తెలిపింది. గాజాలో హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టబోమని ఇజ్రాయెల్ హెచ్చరించింది.
తమ సైన్యానికి అండగా ఇజ్రాయెలీలు..
హమాస్‌తో భీకరంగా పోరాడుతున్న ఐడీఎఫ్ దళాలకు ఇజ్రాయెలీలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గాజా సరిహద్దులో సైనికుల కోసం కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేసి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నారు. రోజుకు దాదాపు 11 వేల సైనికులకు ఆహారాన్ని పెడుతున్నారు. అంతేకాదు సైనికులకు క్షవరం కూడా చేస్తున్నారు. భద్రతా దళాలకు సేవలు అందించేందుకు విదేశాల్లో స్థిరపడిన వారు కూడా స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. కదన రంగంలో బలగాలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యం నింపుతున్నారు. సైనికులు కూడా స్థానికుల ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఇజ్రాయెల్‌లో నిర్బంధ సైనిక శిక్షణ ఉండటంతో ప్రతి ఒక్కరూ సైన్యంలో కొన్నాళ్ల పాటు సేవలందించాల్సిందే. దీంతో యువత నుంచి పెద్దల వరకు అందరూ కదన రంగంలోకి దిగేందుకు విదేశాల నుంచి సైతం వస్తున్నారు. తమ వాళ్లు గాజాలో పోరాడుతుంటే సరిహద్దులో వారి కోసం ఆహారంతో పాటు క్షవరం చేస్తున్నారు. మాతృభూమి కోసం ఎంతకైనా పోరాడుతామని తేల్చిచెబుతున్నారు. పాలస్తీనియన్లతో తాము పోరాడడం లేదని హమాస్ మిలిటెంట్లే తమ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
'మేము ఇక్కడికి వాలంటీర్లుగా వచ్చాము. నేను ఐరోపాలో ఉంటాను. మిలిటెంట్ల దాడి వార్త విని ఇజ్రాయెలీలు అందరూ సైనికులకు సహాయం చేసేందుకు ఇక్కడకు వచ్చారు. ఇక్కడ మేము ఉచితంగా ఆహారం అందిస్తున్నాము. రోజుదు దాదాపు 11 వేల మందికి ఆహారం అందిస్తున్నాము. నా ఇద్దరు సంతానం ప్రస్తుతం కదన రంగంలో పోరాడుతున్నారు. హమాస్ మిలిటెంట్లు పిరికివాళ్లు మేము నిద్రపోతున్నప్పుడు వాళ్లు దాడి చేశారు. ఈ ప్రపంచంలో ఉగ్రవాదులు లేకుండా చేసేందుకు మా తరఫున ఏమి చేయగలమో అది చేస్తాము' అని ఓ వాలంటీర్ పేర్కొన్నారు.