బ్రిటన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు.. శాయశక్తులా కృషి చేస్తానని ఆ దేశ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ హామీ ఇచ్చారు. కన్జర్వేటివ్‌పార్టీ నాయకుడిగా ఎన్నికైన వెంటనే పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయనకు.. ఎంపీలు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన రిషి తనపై విశ్వాసం ఉంచి.. ప్రధానిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళతానని భరోసా ఇచ్చారు రిషి సునాక్.
మా పార్టీ ఎంపీలు, నేతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎంతగానో ప్రేమించే ఈ పార్టీకి, దేశానికి సేవ చేసేందుకు.. నా జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం ఇది. యునైటెడ్ కింగ్‌డమ్ ఓ గొప్ప దేశం. అయితే.. మనం ఆర్థికపరంగా గట్టి సవాలునే ఎదుర్కొంటున్నామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనకు ఇప్పుడు స్థిరత్వం, ఐక్యత అవసరం. మన పార్టీని.. దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడాన్ని అత్యధిక ప్రాధాన్యంగా భావిస్తున్నాను. మనం ఎదుర్కొంటున్న సవాలును ఎదుర్కొనేందుకు.. మన పిల్లలకు మంచి భవిష్యత్‌ను అందించేందుకు ఇదొక్కటే మార్గం. ఎంతో చిత్తశుద్ధితో.. అణకువతో మీకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. బ్రిటీష్ ప్రజలకు అనునిత్యం సేవ చేస్తాను.
-- రిషి సునాక్, బ్రిటన్ ప్రధాని