కరోనా మహమ్మారితో మరణించే ప్రమాదాన్ని తగ్గించేందుకు విటమిన్-డీ సాయపడుతుందనే నిపుణుల సూచనల మేరకు బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి విటమిన్-డీ మాత్రలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం తుది ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఇంగ్లాండ్‌లో ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్న వృద్ధులు సహా తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి శీతాకాలంలో నాలుగు నెలల పాటు విటమిన్-డీని నేరుగా అందించేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు అక్కడి మంత్రులు వెల్లడించారు. తాజా నిర్ణయం.. స్కాటిష్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను అనుసరిస్తున్నట్లు ద సండే టెలిగ్రాఫ్ పేర్కొంది.
వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్‌లోని 20 లక్షల మంది తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులు సహా, ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్న వారికి విటమిన్ డీ మాత్రలను అందించనున్నారు.
" విటమిన్ డీ అవసరమైన వారందరికీ శీతాకాలం మొత్తం ఉచితంగా అందించనున్నాం. కొవిడ్-19 బారినపడిన వారిపై విటమిన్ డీ సానుకూల ప్రభావం చూపుతోందని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి."
- సీనియర్ అధికారి.
బోరిస్ ప్రకటన..
విటమిన్ డీ పంపిణీపై కొద్ది రోజుల క్రితం అడిగిన ప్రశ్నకు.. ' విటమిన్ డీ వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తున్నాం. త్వరలోనే దీనిపై సభకు తెలియజేస్తాం.' అని హౌస్ ఆఫ్ కామన్స్‌లో వెల్లడించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.
విటమిన్-డీ లోపం, కొవిడ్-19 మధ్య సంబంధాలపై మరింత లోతుగా పరీక్షించేందుకు క్లినికల్ ట్రయల్స్‌కు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 'రోగనిరోధక శక్తిపై విటమిన్ డీ ప్రభావం గురించి మరోమారు పరిశీలించాలని శాస్త్రవేత్తలను కోరాను. గత కొన్ని వారాల క్రితం పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్నాం.' అని గత నెలలో బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్కాక్ పేర్కొనటం దానికి బలాన్ని చేకూర్చుతోంది.
ప్రమాదాన్ని తగ్గిస్తుంది..
విటమిన్ డీ లోపం ఉన్నవారిలో కరోనాతో మరణించే ప్రమాదం అధికంగా ఉంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు వెల్లడించాయి. ఈ విటమిన్ ద్వారా శరీరంలో కాల్షియం, ఫాస్పేట్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. దాంతో ఎముకలు, దంతాలు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. సూర్యరశ్మి తగిలిన సమయంలో శరీరం సొంతంగా విటమిన్ డీ ని తయారు చేసుకుంటుంది.
ఇదీ చూడండి: జర జాగ్రత్త: మీలో ఆ లోపముంటే కరోనా వైరస్ ముప్పు మీకే అధికం