బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్ గడువును జనవరి 31 వరకు పొడిగించిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆయన ప్రతిపాదనను చట్టసభ సభ్యులు తిరస్కరించారు.
బ్రెగ్జిట్ గడువును అక్టోబర్ 31 నుంచి 2020 జనవరి 31 వరకు పొడిగించేందుకు ఈయూ అంగీకరించింది. 2016లో ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు బ్రిటన్ నిర్ణయం తీసుకున్న తరువాత.. గడువును పెంచడం ఇది రెండోసారి.
ఈయూ నిర్ణయాన్ని అంగీకరించిన ప్రధాని బోరిస్.. డిసెంబర్ 12న ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని బ్రిటన్ పార్లమెంట్లో ప్రతిపాదించారు. 'ప్రతిపక్ష నాయకుడు దీనిపై సాకులు చెప్పడానికి అవకాశం లేదని భావిస్తున్నాను' అని ప్రతిపక్ష నేత, లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్కు బోరిస్ సవాల్ విసిరారు.
ముందస్తు వద్దు..
డిసెంబర్ 12న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే బోరిస్ ప్రతిపాదనను చట్టసభ్యులు తిరస్కరించారు. బ్రెగ్జిట్ కోసం బోరిస్ 100 మిలియన్ పౌండ్లను ఖర్చు చేశారని, అయితే ఫలితం మాత్రం శూన్యమని కార్బిన్ విమర్శించారు.
'ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే బోరిస్ తీర్మానం నెగ్గాలంటే చట్టసభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. దీనిని బోరిస్ సాధించలేకపోయారు. ఇప్పుడు బోరిస్.. తన ఓటమికి కారణం పార్లమెంట్ అని నిందించడానికి ప్రయత్నిస్తారు. ప్రధానిగా బోరిస్ చేసిన ఏ ఒక్క వాగ్దానాన్నీ నెరవేర్చలేకపోయారు.'
- జెరెమి కార్బిన్, లేబర్ పార్టీ నాయకుడు
ఇదీ చూడండి: ఉగ్రసింహం 'బాగ్దాదీ' కుక్కచావు..!