2022 చివరి నాటికి భారత్ 500 కోట్ల కొవిడ్ టీకా డోసులను ఉత్పత్తి చేసి, కరోనా పోరాటంలో ప్రపంచానికి బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జీ-20 సదస్సులో(G20 Summit 2021) మాట్లాడిన ఆయన కరోనాపై పోరులో భారత్ భాగస్వామ్యాన్ని ప్రధానంగా వివరించారు. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా వెల్లడించారు.
"అంతర్జాతీయ ప్రయాణాలు పునరుద్ధరించడం, కరోనా టీకా ధ్రుపత్రాలను పరస్పరం గుర్తించుకోవడం వంటి అంశాలను జీ-20 సదస్సులో మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. భారత్ స్వదేశీ టీకా కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలపాల్సి ఉన్న విషయాన్ని కూడా పేర్కొన్నారు. ఈ టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభిస్తే ఇతర దేశాలకు భారత్ మరింత సాయపడగలదని వివరించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో 150 దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేసిందని గుర్తు చేశారు.
-హర్షవర్ధన్ శ్రింగ్లా, భారత విదేశాంగ కార్యదర్శి
జీ-20 సదస్సులో(G20 Summit 2021) 'ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సెషన్'లో భాగంగా మోదీ ఈ మేరకు మాట్లాడారని శ్రింగ్లా తెలిపారు. సుస్థిర ప్రపంచ సరఫరా గొలుసుల ఆవశ్యకతను వివరించారని.. భారత్ సాహసోపేత ఆర్థిక సంస్కరణల గురించి వివరించారని చెప్పారు. ఆర్థిక పునరుద్ధరణ, సరఫరా గొలుసు వైవిధ్యీకరణలో భారత్‌ను తమ భాగస్వామిగా మార్చుకోవాలని జీ20 దేశాలను మోదీ ఆహ్వానించారని వెల్లడించారు.
ఇవీ చూడండి: