మయన్మార్‌లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి అత్యయిక పరిస్ధితిని విధించడం పట్ల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంగ్ సాన్ సూకీ సహా నిర్బంధంలో ఉంచిన నేతలందరినీ సైనిక ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మయన్మార్‌లో ప్రభుత్వ మార్పిడి ప్రక్రియ.. ప్రజాస్వామ్యయుతంగా జరిగేందుకు నిరంతరం మద్దతు అవసరం అని తెలిపింది.
ప్రజాస్వామ్య సంస్ధలు, ప్రక్రియను కాపాడాలని ఐరాస భద్రతా మండలి పేర్కొంది. హింసకు దూరంగా ఉండి మానవ హక్కులు, న్యాయం, ప్రాథమిక స్వేచ్ఛను పరిరక్షించాలని పిలుపునిచ్చింది.
మయన్మార్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా వారి ప్రయోజనాలను కాపాడేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి.. చర్చలు, ఐకమత్యాన్ని ప్రోత్సహించిందని తెలిపింది. మయన్మార్ సంక్షోభానికి మూలకారణాలను కనుక్కోవాలన్న భద్రతామండలి.. ఆచూకీ తెలియకుండాపోయిన వ్యక్తులు సురక్షితంగా, గౌరవప్రదంగా వచ్చేలా చేయాలని పేర్కొంది.
బైడెన్ ఆగ్రహం..
మయన్మార్‌లో అత్యయిక పరిస్థితిని విరమించాలని, అంగ్‌సాన్ సూకీ సహా నిర్బంధంలో ఉంచిన పలువురు నేతలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు జో జైడెన్ డిమాండ్ చేశారు. సైనిక ప్రభుత్వం విధించిన ఆంక్షలను తొలగించాలని, హింసకు దూరంగా ఉండాలని అన్నారు.
భారత్ స్పందన..
ఈ నేపథ్యంలో మయన్మార్ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు భారత్ పేర్కొంది.
"భారత్- మయన్మార్ మధ్య సత్సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్థిక, వ్యాపార, భద్రతా రంగాల్లో పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తున్నాం" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.
ఇదీ చదవండి:చైనా కనుసన్నల్లో పాక్- 'కశ్మీర్' పేరిట హింసోన్మాదం