మయన్మార్‌లో సైనిక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. సైనిక ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపుతున్నా వెనక్కి తగ్గడం లేదు. యాంగూన్‌లో ఈస్టర్ హాలిడే ఆదివారం నాడు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. పెయింటింగ్ వేసిన గుడ్లను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ, నిరసన గీతాలు పాడుతూ ప్రదర్శన నిర్వహించారు.
గుడ్లపై వివిధ రంగులతో రకరకాల పెయింటింగ్‌లు వేశారు. పలు నినాదాలు రాశారు. మూడు వేళ్లతో సెల్యూట్ చిత్రాలు వేశారు. పూలతోనూ నిరసన తెలిపారు. భద్రతా దళాల దాష్టీకానికి బలైపోయినవారికి నివాళులర్పిస్తూ పలుచోట్ల పూలుజల్లారు. మాండలే నగరంలో ఉదయం ద్విచక్రవాహనాలపై వచ్చిన ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు భద్రతా దళాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయి. ప్యిన్మనాలో ఆందోళన చేపట్టిన ప్రజలపై కాల్పులు జరపడం వల్ల ఒకరు చనిపోయారు.
ఇదీ చూడండి:మయన్మార్‌లో హింసను ఖండించిన భారత్