హాంకాంగ్ చట్టసభ శుక్రవారం నిరసనలతో హోరెత్తింది. దేశంలో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు చైనా ప్రతిపాదించిన బిల్లుకు వ్యతిరేకంగా.. ప్రజాస్వామ్య అనుకూల చట్టసభ్యులు ఆందోళనకు దిగారు. దేశంపై చైనా నియంతృత్వ చర్యలకు ఇది నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శాసనసభలో గందరగోళం సృష్టిస్తూ.. నిరసనలకు దిగిన ఇద్దరు చట్టసభ్యులను బలవంతంగా సభ నుంచి బయటకు లాక్కెళ్లారు భద్రతా సిబ్బంది.
బిల్లులో ఏముంది?
శుక్రవారం ప్రారంభమైన చైనా జాతీయ అసెంబ్లీ సమావేశంలో.. ఈ బిల్లును ప్రతిపాదించింది అక్కడి ప్రభుత్వం. ఈ తీర్మానాన్ని హాంకాంగ్ చట్టసభ ముందుకూ తీసుకొచ్చారు. గతేడాది నేరస్థుల అప్పగింత బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్‌లో నిరసనలు వెల్లువెత్తినా.. మళ్లీ బీజింగ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
బీజింగ్ సహనం కోల్పోయిందా?
గడిచిన కొన్ని సంవత్సరాల్లో నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్సీపీ) అజెండాలోని అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో ఇదీ ఒకటి. ఈ ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం, హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, హాంకాంగ్‌లో జరిగిన ఆందోళనలతో బీజింగ్ సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల కార్యకలాపాలను పరిమితం చేయాలని నిశ్చయించుకుంది. 2003లో ఈ చట్టాన్ని ఆమోదింపజేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ, అప్పట్లో జరిగిన భారీ నిరసనల కారణంగా బిల్లు అలాగే నిలిచిపోయింది. ఈసారి ఎలాగైనా తీర్మానాన్ని ఆమోదింపజేయాలని కృతనిశ్చయంతో ఉంది చైనా.
ఇదీ చూడండి:కరోనా వేళ.. చట్టసభలో కొట్టుకున్న ఎంపీలు!