వరుస కార్చిచ్చులు, వరదలతో విలవిలలాడిన ఆస్ట్రేలియా ప్రజలు ఇప్పుడు మరో రెండు ప్రకృతి ప్రకోపాలను చవిచూస్తున్నారు. వడగళ్ల వాన, ఇసుక తుపానులు ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని కాన్బెర్రాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. గోల్ఫ్ బంతి పరిమాణంలో పార్లమెంటు భవనంపై వడగండ్లు పడినట్లు అధికారులు తెలిపారు. భారీస్థాయిలో మంచుగోళాలు పడిన కారణంగా పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెయ్యికి పైగా ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విపరీతంగా వీస్తున్న గాలులకు ప్రభావంతో ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కమ్మేసిన ఇసుక తుపాను...
న్యూ సౌత్‌వేల్స్‌లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గంటకు 107 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో డబ్బో నగరాన్ని తుపాను కమ్మేసింది. గాలుల తీవ్రత కారణంగా ఓ పాఠశాల నేలమట్టమయ్యింది. ఇసుక తుపాను కారణంగా బ్రోకెన్ హిల్, నిన్గాన్, పారక్స్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది.
ఇదీ చూడండి: కేంద్ర మంత్రి క్రికెట్ ఆడితే ఇలా ఉంటుంది!