కొవిడ్-19 మహమ్మారికి కారణమైన సార్స్-కోవ్-2 వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై అంతర్జాతీయ దుమారం చెలరేగింది. ఆరోపణలు, ఖండనలు మొదలయ్యాయి. తాజాగా నోబెల్ బహుమతి గ్రహీత లుచ్ మౌంటెనియర్ వంటి వారు లీకేజీ అనుమానాలకు బలాన్ని చేకూర్చే వ్యాఖ్యలు చేశారు. అయితే తమపై వస్తున్న ఆరోపణలను వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూఐవీ) డైరెక్టర్ యువాన్ జిమింగ్ ఖండించారు. వైరస్‌ను కృత్రిమంగా తయారుచేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు.
అది ప్రయోగశాలలో పుట్టిందే..
"సార్స్-కోవ్-2 జన్యుక్రమంలో హెచ్‌ఐవీ, మలేరియా పరాన్నజీవికి సంబంధించిన జన్యువులు ఉండటం అనుమానాస్పదంగా ఉంది. ఈ వైరస్ లక్షణాలు సహజసిద్ధంగా లేవు. వుహాన్ ప్రయోగశాలలో పెను ప్రమాదం జరిగింది."
- లుచ్ మౌంటెనియర్, 2008లో నోబెల్ విజేత, ప్రముఖ వైరాలజిస్టు
(ఎయిడ్స్‌కి వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో ఈ వైరస్ లీక్ అయ్యిందని అంతర్లీనంగా చెప్పారు)
కావాలని చేసి ఉంటే..
'వారు కావాలని చేస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. పొరపాటున లీక్ కావడానికి, ఉద్దేశపూర్వకంగా చేయడానికి మధ్య పెద్ద తేడా ఉంది. ఆ రెండింట్లో ఏది జరిగినా వారు మాకు విషయాన్ని తెలియజేసి, మమ్మల్ని ల్యాబ్‌లోకి అనుమతించి ఉండాల్సింది. కానీ అలా చేయలేదు. ఏదో తేడా జరిగిందని చైనాకు తెలుసు. వారు ఇబ్బందికర పరిస్థితిలో పడినట్లున్నారు. అమెరికాతో పోలిస్తే చైనాలోనే ఎక్కువ మంది ఈ మహమ్మారికి బలై ఉంటారు.'
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్
స్వతంత్ర దర్యాప్తు చేయాలి: ఆస్ట్రేలియా
కొవిడ్-19 మహమ్మారి పుట్టుక, దానిపై ప్రపంచం స్పందించిన తీరుపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలి. సంక్షోభాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) ఎదుర్కొన్న విధానంపై కూడా విచారణ జరగాలి. చైనాలో మహమ్మారి చెలరేగినప్పుడు డబ్ల్యూహెచ్‌వో తీరు సరిగాలేదు. సమస్య తీవ్రతను కప్పిపుచ్చిందన్న ట్రంప్ విమర్శలతో మేం ఏకీభవిస్తున్నాం.
మా పరిశోధనల్లో జోక్యానికే: చైనా
'డబ్ల్యూఐవీ సంస్థలో పరిశోధనలు సాగుతున్న తీరు, వైరస్‌లు, నమూనాలను నిర్వహించే విధానంపై మాకు పూర్తి అవగాహన ఉంది. ఆ వైరస్ మా దగ్గర నుంచి బయటకు రాలేదు. అలాంటి అవకాశమే లేదు. మా వద్ద కఠిన నియంత్రణలు ఉన్నాయి. పరిశోధనలకు సంబంధించి మాకు నియమావళి ఉంది. ఊహాగానాల ఆధారంగానే ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా.. మహమ్మారి కట్టడికి మేం చేపడుతున్న చర్యల్లోను, మా శాస్త్రీయ పరిశోధనల్లో జోక్యం చేసుకోవాలన్నది వారి ఉద్దేశం. మహమ్మారి వెలుగులోకి వచ్చాక సదరు వైరస్‌కు సంబంధించిన జన్యుపటాన్ని ఆవిష్కరించి అందుబాటులో ఉంచాం. చికిత్సలు, టీకాలకు సంబంధించి తాజా పరిశోధన వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)కు సమర్పించాం. ఏదో రకంగా వారు తమ లక్ష్యాన్ని సాధించి ఉండొచ్చు. అయితే ఒక సైంటిస్టుగా, శాస్త్ర, సాంకేతిక అంశాల మేనేజర్‌గా ఒక్క విషయాన్ని చెప్పగలను. వైరస్ మా దగ్గర నుంచి లీక్ కావడం అసాధ్యం. వైరస్‌ను కృత్రిమంగా తయారుచేయడానికి అసాధారణ మేధస్సు, భారీగా శ్రమ అవసరం. అందువల్ల ఇలాంటి వైరస్‌ను సృష్టించే సామర్థ్యం ప్రస్తుతం మానవులకు ఉందని నేను విశ్వసించడంలేదు’''
- యువాన్ జిమింగ్, డబ్ల్యూఐవీ డైరెక్టర్
ఇతర కరోనా వైరస్‌లూ ఇలానే..
"ప్రకృతిలోని ఇతర కరోనా వైరస్‌లలోనూ ఇదే తరహా పోకడ కనిపిస్తోంది. ఇవి చాలా చిన్న అంశాలు. ఇదే వైరస్ కుటుంబంలోని చాలా వాటిల్లో ఈ అంశాలను కనుగొన్నాం. మౌంటెనియర్ ప్రకటన అర్థవంతంగా లేదు."
- సైమన్ లోరియర్, ది ఇనిస్టిట్యూట్ పాశ్చర్‌లో వైరాలజిస్టు
ఇదీ చదవండి: ల్యాబ్ నుంచే వైరస్! వుహాన్‌లో ఏం జరిగింది?