హాంకాంగ్‌లో పాలనపై మరింత పట్టు సాధించేలా చైనా కీలక అడుగు వేసింది. ఈ మేరకు హాంకాంగ్ అసెంబ్లీలో ప్రత్యక్ష ఎన్నిక సభ్యుల సంఖ్యను 35 నుంచి 20కి తగ్గించింది చైనా.
ప్రస్తుతం హాంకాంగ్ చట్ట సభలో 70 మంది సభ్యులుండగా .. ఆ సంఖ్యను 90కి పెంచింది. ఇకపై వీరిలో కేవలం 20 మంది మాత్రమే ప్రజల నుంచి ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. రెండు రోజులపాటు సమావేశమైన అనంతరం చైనా అత్యున్నత శాసనసభ.. హాంకాంగ్ రాజ్యాంగంలో సవరణలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది హాంకాంగ్‌లో జాతీయ భద్రతా చట్టాన్ని తీసుకొచ్చిన చైనా.. తాజాగా ఎలక్టోరల్ విధానంలోనూ సవరణలు చేయడం గమనార్హం.
ఇక 20 మందే ప్రజానేతలు
నూతన సవరణల ప్రకారం.. హాంకాంగ్ శాసనసభలో 20 మంది ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు ఉంటారు. 30 మందిని నియోజకవర్గాల నుంచి నామినేట్ చేస్తారు. 40 మందిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఈ కమిటీలో 1200-1500 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల అర్హతలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఉంటుంది.
హాంకాంగ్‌లో రాజకీయ స్థిరత్వం కోసమే.. సంస్కరణలు చేస్తున్నట్లు చైనా చెప్పుకొచ్చింది.
2019లో చైనా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా హాంకాంగ్ అట్టుడికింది. ప్రజలు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. దీంతో చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అలా చైనా చేతుల్లోకి
చైనాకు బ్రిటన్‌కు మధ్య జరిగిన 'నల్లమందు యుద్ధాల' అనంతరం హాంకాంగ్ నగరం బ్రిటిష్ పాలనలోకి వెళ్లింది. అప్పట్లో హాంకాంగ్‌ను బ్రిటన్ 99 ఏళ్ల లీజుకు తీసుకొంది. 1997లో లీజు గడువు ముగియగా.. తిరిగి చైనాకు అప్పగించింది. ఆ సందర్భంగా 'ప్రాథమిక చట్టం' (బేసిక్ యాక్ట్) పేరుతో ఓ చిన్న తరహా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఒక దేశం- రెండు విధానాలు అన్న సిద్ధాంతం అమల్లోకి వచ్చింది.
ఇదీ చదవండి : అమెరికాలో కార్చిచ్చు- 400 ఇళ్లు ఖాళీ