అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్ష పదవికి సవాల్ చేస్తున్న జో బైడెన్ మొట్టమొదటిసారిగా ఎదురుపడనున్నారు. తొలిసారి ఒకే వేదిక పంచుకోనున్న ఇరువురు నేతలూ.. అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన డిబేట్లలో భాగంగా మొదటి సంవాదంలో వాగ్బాణాలు సంధించుకోనున్నారు.
ఏఏ అంశాలపై చర్చ ?
'సూపర్ బౌల్ ఆఫ్ అమెరికన్ డెమొక్రసీ'గా పేర్కొంటున్న ఈ రసవత్తర సంవాదంలో భాగంగా కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. నేతలు తమ విజయాలు, అర్హతల గురించి వివరిస్తారు. ప్రధాన అంశాలుగా ఉన్న సుప్రీం కోర్టు, కొవిడ్-19, ఆర్థిక వ్యవస్థ, జాత్యాంహకారం-నగరాల్లో హింస, ఎన్నికల పారదర్శకత వంటి సమస్యలపై డిబేట్ జరగనుంది.
డిబేట్ ఎక్కడ ?
2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన మొదటి డిబేట్.. కీలకమైన రణక్షేత్రంగా భావిస్తోన్న ఒహాయో రాష్ట్రంలో జరగనుంది. క్లీవ్‌ల్యాండ్ ప్రాంతంలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు.
ఏ సమయంలో ?
ఈ చర్చ అమెరికన్ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 29 రాత్రి 9 గంటలకు ఆరంభమవుతుంది. భారత కాలమానంలో సెప్టెంబర్ 30 ఉదయం 6:30గంటలకు వీక్షించవచ్చు.
వ్యాఖ్యాత ఎవరు ?
ఈ డిబేట్‌ను ఫాక్స్ న్యూస్ యాంకర్ క్రిస్ వాలెస్ నిర్వహిస్తారు. చర్చకు సంబంధించిన అంశాలు సైతం క్రిస్ ఎంపిక చేసినవే. ఒక్కో అంశంపై 15 నిమిషాలకు తగ్గకుండా ఇరువురు నేతలు చర్చించనున్నారు.
మొత్తం ఎన్ని చర్చలు ?
2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మొత్తం 3 డిబేట్లు జరగనున్నాయి. విభిన్న అంశాలపై అధ్యక్షుడు ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్ చర్చించనున్నారు.
ఉపాధ్యక్షుల డిబేట్ మాటేంటి ?
అధ్యక్ష అభ్యర్థుల డిబేట్లతో పాటే.. ఉపాధ్యక్ష పదవి పోటీదారులకూ చర్చ జరగనుంది.
ఈ డిబేట్లు ఎవరు నిర్వహిస్తారు ?
ఈ చర్చలన్నీ కమిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ డిబేట్స్.. సీడీపీ నిర్వహిస్తుంటుంది. 1987లో ఏర్పాటైన కమిషన్.. ఈ పార్టీలతో సంబంధంలేని స్వచ్ఛంద సంస్థ. దశాబ్దాలుగా అమెరికన్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల చర్చలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఎవరి దగ్గరా విరాళాలు స్వీకరించదు. పూర్తి పారదర్శకతతో ఒక్కో డిబేట్‌ను 90 నిమిషాల పాటు జరుపుతుంటుంది.
మొదటి డిబేట్ ఎప్పుడు జరిగింది ?
అమెరికన్ అధ్యక్ష ఎన్నికల చరిత్రలో మొట్టమొదటి డిబేట్... 1960 సెప్టెంబర్ 26న జరిగింది. షికాగో వేదికగా జరిగిన నాటి చర్చలో అప్పటి సెనేటర్ జాన్ ఎఫ్ కెనెడీ, ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాల్గొన్నారు. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ డిబేట్ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల స్వరూపాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ ఏడాది కెనెడీ-నిక్సన్ నాలుగు సార్లు డిబేట్లో పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల్లో కెనెడీ అధ్యక్షుడిగా విజయం సాధించారు.
అమెరికాలో అధ్యుక్షుడిని ఎన్నుకునేందుకు ఎన్నికలకు ముందు నిర్వహించే ఈ డిబేట్లను కీలకంగా భావిస్తుంటారు అమెరికన్లు. ఈ చర్చల్లో నాయకుల ఆలోచనలు, అభిప్రాయాలు ఓటర్లను ప్రభావితం చేస్తుంటాయి. ప్రజలను తమవైపు తిప్పుకోవటానికి నాయకులకు సైతం వేదికగా నిలుస్తాయి. అందుకే అమెరికన్ అధ్యక్ష ఎన్నికల క్రతువులో డిబేట్లకు అంత ప్రాధాన్యం.
ఇదీ చూడండి: రెండేళ్లలో ట్రంప్ పన్ను చెల్లింపులు 750 డాలర్లు మాత్రమే!
ఇదీ చూడండి: బైడెన్ ప్రచారంపై సొంత పార్టీలోనే కలవరం !
ఇదీ చూడండి: 'అంతరిక్షం నుంచే ఓటు హక్కు వినియోగించుకుంటా'