ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్(vaccination) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. కొత్తరకాలు పుట్టుకురావడం వ్యాక్సిన్ల పనితీరుకు ఒక సవాలుగా మారింది. దీంతో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ సంస్థలు ఆయా వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యంపై అధ్యయనాలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు భావిస్తోన్న డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఇక భారత్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్‌తో పాటు స్పుత్నిక్ వ్యాక్సిన్‌లు కూడా డెల్టా వేరియంట్(Delta variant)పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ఇదివరకే వెల్లడైంది.
మరోసారి వైరస్..
కొత్తగా వెలుగు చూస్తోన్న కరోనా(Corona virus) వేరియంట్లపై వ్యాక్సిన్లు ఏమేరకు పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ముఖ్యంగా భారత్‌లో అత్యధిక ప్రభావం చూపిస్తోన్న డెల్టా వేరియంట్‌తో పాటు కప్పా రకంపైనా అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి రక్తంలో యాంటీబాడీల సామర్థ్యాన్ని పరీక్షించారు. డెల్టా, కప్పా రకాలను తటస్థీకరించడంలో ఇవి సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అయితే, యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతున్నట్లు గుర్తించిన నిపుణులు.. ఇవి బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లకు (మరోసారి వైరస్ బారినపడే) కారణమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. తాజా అధ్యయనం 'జర్నల్ సెల్'లో ప్రచురితమైంది.
రీ-ఇన్‌ఫెక్షన్‌లపై..
కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వైరస్ బారిన పడే అవకాశాలపై ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇంతకుముందు దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకానికి చెందిన బీటా, గామా లైనేజీలు సోకిన వారు డెల్టా వేరియంట్ బారినపడే ప్రమాదం ఉందని గుర్తించారు.
స్పుత్నిక్ సైతం..
ఇక దేశంలో కొత్తగా వెలుగుచూసిన డెల్టా రకంపై కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని భారత ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా జరిపిన అధ్యయనంలో డెల్టా రకంపై స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అత్యధిక ప్రభావశీలత చూపించిందని ఆ వ్యాక్సిన్‌ను తయారుచేసిన గమలేయా ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. ఇక వైరస్ వ్యాప్తి, తీవ్రత అధికంగా ఉన్న ఈ డెల్టా వేరియంట్ ఇప్పటివరకు భారత్‌తో పాటు 80దేశాలకు వ్యాపించింది. అంతేకాకుండా ఇది మ్యుటేషన్ చెంది.. డెల్టా ప్లస్‌గా అవతరించింది. దీన్ని ఇప్పటికే భారత ప్రభుత్వం ఆందోళనకర వేరియంట్‌గా పేర్కొంది. తాజాగా పలురాష్ట్రాల్లో వెలుగుచూస్తోన్న డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఇప్పుడున్న వ్యాక్సిన్‌లు ఏమేరకు ఎదుర్కొంటాయే అనే విషయంపై అధ్యయనాలు జరగాల్సి ఉంది.
ఇవీ చదవండి: