అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు దక్షిణ కాలఫోర్నియా సెనేటర్ లిండ్సే గ్రహమ్. తమ దేశ వస్తువులపై సుంకాల విధింపులో భారత్ ప్రపంచంలోనే అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపైనే చర్చ జరగనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సెనేటర్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
భారత్‌ను "సుంకాల రారాజు" అని ఇది వరకే విమర్శించారు ట్రంప్. దక్షిణాసియా దేశాల వ్యవహారాలకు సంబంధించి ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరైన సెనేటర్ లిండ్సే ఇప్పుడు అదే తరహా వ్యాఖ్యలు చేశారు.
అమెరికా వస్తువులపై ఇతర దేశాలు అధిక సుంకాలు విధిస్తే... తిరిగి అంతే మొత్తంలో ఆయా దేశాల వస్తువులపై అగ్రరాజ్యం సుంకాలు విధించేలా బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు లిండ్సే.
అమెరికా వస్తువులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోందని, తాము కూడా తిరిగి అదే స్థాయిలో ఆ దేశ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని హెచ్చరించారు లిండ్సే. పరస్పర అంగీకారంతో సుంకాలను సున్నాకు తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.
ఇదీ చూడండి: తుపానుపై అణు బాంబు వేస్తే సరి: డొనాల్డ్ ట్రంప్