ఎక్స్-రే, సిటి స్కాన్‌లను పరిశీలించి కరోనా సోకిందో, లేదో తేల్చిచెప్పే కంప్యూటర్ ఆధార 'కృత్రిమ మేధ (ఏఐ) అల్గారిథం'ను సెంట్రల్ ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. కొవిడ్ కారణంగా తలెత్తే ఊపిరితిత్తుల వాపును ఇది 90% కచ్చితత్వంతో గుర్తిస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. కొవిడ్ ప్రధానంగా శ్వాసవ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా చాలామందిలో ఊపిరితిత్తుల సమస్య (నిమోనియా) తలెత్తుతుంది. కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సిటి) స్కాన్, ఎక్స్-రే ద్వారా దీన్ని గుర్తించవచ్చు. సాధారణ ఇన్‌ఫ్లుయెంజాకు కూడా నిమోనియా తలెత్తుతుంది కాబట్టి.. ఏ కారణంగా ఊపిరితిత్తుల సమస్య ఎదురైందో స్పష్టంగా విశ్లేషించేలా పరిశోధకులు ఈ అల్గారిథం రాశారు.
ఆ తర్వాత చైనా, జపాన్ ఇటలీకి చెందిన 1,280 మంది కొవిడ్ బాధితులకూ; ఇతర వ్యాధులతో బాధపడుతున్న మరో 1,337 మందికీ సిటి స్కాన్, ఎక్స్-రేలు తీయించారు. వీటిని అల్గారిథం ద్వారా పరీక్షించగా.. వారిలో ఊపిరితిత్తుల సమస్య ఏ కారణంగా తలెత్తిందో చాలామటుకు కచ్చితంగా నిర్ధరించడం విశేషం.