అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్ జనవరిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అధ్యక్షుడయ్యాక వలస విధానంలో ఆయన కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 5 లక్షల మంది భారతీయులు సహా మొత్తం కోటి 10 లక్షల మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇవ్వనున్నట్లు ఎన్నికల సమయంలో విధాన పత్రంలో పేర్కొన్నారు బైడెన్. ఇమిగ్రేషన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు.
'అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను సంస్కరించేందుకు కాంగ్రెస్‌లో తీర్మానం ప్రవేశ పెడతారు. కుటుంబ ఆధారిత వలసలకు ప్రాధాన్యమిచ్చి 5లక్షల మంది భారతీయులు సహా సరైన పత్రాలు లేని 11 మిలియన్ల మంది విదేశీయులకు అమెరికా పౌరసత్వం కల్పించే దిశగా అడుగులు వేస్తారు' అని విధాన పత్రంలో బైడెన్ పేర్కొన్నారు.
దేశంలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యను ఏడాదికి 1,25,000కి పెంచనున్నట్లు విధాన పత్రం స్పష్టం చేసింది. సంవత్సరానికి కనీసం 95,000మంది శరణార్థులను స్వాగతించేలా కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొంది.
విదేశీయులకు శాశ్వత నివాసం కల్పించే గ్రీన్‌కార్డుల సంఖ్యను కూడా పెంచుతామని విధాన పత్రంలో పొందుపరిచారు బైడెన్. ఒక్కో దేశానికి పరిమిత సంఖ్యలో గ్రీన్‌కార్డులు మంజూరు చేయాలనే నిబంధనలు సవరిస్తామన్నారు. దీని ద్వారా భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది.
ముస్లిం దేశాలపై నిషేధం ఎత్తివేత!
ఇరాన్, సిరియా వంటి ముస్లిం మెజారిటీ దేశాల ప్రజలు అమెరికాలో పర్యటించకుండా డొనాల్డ్ ట్రంప్ విధించిన వివాదాస్పద ఆంక్షలను తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని బైడెన్ విధాన పత్రంలో ఉంది.