సుడాన్ ప్రధానమంత్రి అబ్దుల్లా హామ్డోక్ను తామే నిర్బంధించామని (Sudan PM arrested) ఆ దేశ సైనికాధికారులు స్పష్టం చేశారు. తిరుగుబాటు (Sudan Military Coup) అనంతరం అబ్దుల్లాతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నట్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం వారిద్దరినీ తమ నివాసాలకు వెళ్లేందుకు అనుమతించినట్లు చెప్పారు.
ప్రజాస్వామ్యయుత పాలనకు చరమగీతం పాడుతూ ప్రభుత్వంపై సోమవారం తిరుగుబాటు (Sudan coup 2021) చేసింది అక్కడి సైన్యం. సైన్యాధికారి జనరల్ అబ్దెల్ ఫటా బుర్హాన్ నేతృత్వంలో ప్రభుత్వ అధికారులందరినీ అరెస్టు చేసింది. దీనిపై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఐరాస, ఐరోపా, అమెరికా ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. సుడాన్‌కు అమెరికా అందిస్తున్న 700 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు బైడెన్ యంత్రాంగం ప్రకటించింది. ప్రభుత్వ అధికారులందరినీ విడిచిపెట్టాలని స్పష్టం చేసింది.
స్వేచ్ఛ ఉంటుందా?
అన్ని వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడితోనే ప్రధానిని సైన్యం విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. విడుదల తర్వాత ప్రదాని అబ్దుల్లా స్వేచ్ఛగా ఉంటారా, లేదా గృహనిర్బంధం వాతావరణంలోనే గడుపుతారా అనే విషయంపై స్పష్టత లేదు. అబ్దుల్లా నివాసం ఉన్న ఖర్తోమ్ పరిసరాల్లో భారీగా సైనికులు పహారా కాస్తున్నారు.
ప్రధాని వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకొనే ఆయన్ను నిర్బంధించినట్లు సైనికాధికారి బుర్హాన్.. గత మంగళవారం పేర్కొన్నారు. త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. తిరుగుబాటు (Sudan coup 2021) వ్యతిరేక నిరసనలకు నేతృత్వం వహించే ప్రభుత్వాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆగని నిరసనలు
మరోవైపు, సుడాన్లో నిరసనలు ఆగడం లేదు. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు... హింసాత్మకంగా మారాయి. రాజధాని ఖార్టూమ్, ఓమ్‌దుర్మాన్‌లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు చనిపోయారు. మరో 140 మంది గాయపడినట్లు అల్ జజీరా వార్త సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి: