ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియా గ్రామంలోని రసాయన కర్మాగారంలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలోని వెంకటనారాయణ కర్మాగారంలో ఈ ఉదయం ఎనిమిదిన్నరకు గ్యాస్ లీకైంది. విధులకు వచ్చిన కార్మికుల్లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరో వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిచించారు. ఇదే కర్మాగారంలో గతంలోనూ గ్యాస్ లీకై ఇద్దరు చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో స్థానికంగా సంచలనంగా మారింది. తాజా ఘటనతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారం వద్ద నిరసనకు దిగారు. ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పంటపొలాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కర్మాగారంలోనికి ఎవర్నీ అనుమతించడం లేదు.
ఘటన బాధాకరం: తెదేపా నేత సోమిరెడ్డి
నెల్లూరు జిల్లాలో రసాయన పరిశ్రమ ఘటనపై మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చండ్రపడియాలో ముగ్గురు కార్మికులు మృతిచెందడం బాధాకరమన్నారు. ఇదే పరిశ్రమలో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినా చర్యలు శూన్యమని విమర్శించారు. యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్న ఆయన... బాధిత కుటుంబాలను ఆదుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: లాక్‌డౌన్‌పై ఇవాళ సర్కారు కీలక నిర్ణయం!