నిజామాబాద్ జిల్లా బాల్కొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మూడు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రెండు లారీలు ఒకదాన్ని ఒకటి అధిగమించబోయి ఢీకొన్నాయి. ఆ తర్వాత మరో కంటైనర్ వేగంగా వచ్చి ప్రమాదానికి గురైన లారీని బలంగా ఢీకొంది.
ఈ ఘటనలో కంటైనర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. అతడిని బయటికి తీసేందుకు పోలీసులు, హైవే సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. కొద్ది సేపటికి కంటైనర్ డ్రైవర్ వాహనంలోనే మృతిచెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.