ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. శృంగవరపుకోట నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు.. ధర్మవరం దగ్గరకు రాగానే.. డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది. అదుపు తప్పిన బస్సు రోడ్డుపై నడుస్తున్న ఏడో తరగతి విద్యార్థిని ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇంటిలోకి బస్సు దూసుకెళ్లింది. ఇంటి యజమానురాలుకు తీవ్ర గాయాలయ్యాయి.
విద్యార్థి మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ఉన్న వారికి ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదని వెల్లడించారు. అనంతరం డ్రైవర్ ఆర్జీ నాయుడును సుంగరపాడు ప్రాంతీయ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇతనికి గతంలో విధుల్లో ఉండగా ఫిట్స్ రావడంతో అతన్ని నేరుగా ఆసుపత్రి తీసుకువచ్చినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఫిట్స్ ఉన్న వ్యక్తికి డ్రైవింగ్ బాధ్యతలు అప్పగించడంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఐ సింహాద్రి నాయుడు ఎస్సై తారకేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన అభిషేక్ స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. తండ్రి గోవిందా తల్లి మాధవి తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
వీరికి చాలా కాలం పిల్లలు కలగలేదు లేకలేక పుట్టిన కొడుకు ఇలా మృత్యుపాలవడం ఆ దంపతులను తీవ్ర విషాదంలో ముంచింది. ఆర్టీసీ డిపో మేనేజర్ రమేష్ సంఘటన స్థలాన్ని సందర్శించి వెళ్లారు. డ్రైవరు 15 రోజుల క్రితమే ఫిట్ సర్టిఫికేట్ సమర్పించాడని తెలిపారు. గతంలో ఫిట్స్ వచ్చిన విషయం తనకు తెలియదు అన్నారు.
ఇవీ చదవండి: