CP Chauhan respond on Naveen Reddy case: మహిళలపై దాడులు చేస్తే క్షమించేది లేదని రాచకొండ సీపీ చౌహన్ హెచ్చరించారు. ఆదిభట్ల పరిధిలో బీడీఎస్ విద్యార్ధిని అపహరణ కేసులో నిందితుడు నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ విషయంలో ఆయన స్పందించారు. మహిళల భద్రత విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నామని తెలిపారు.
యువతికి ఇష్టం లేకుండా ఆమెను వేధించడం, వారి ఇంటిపై దాడి చేయడం నేరమని తెలిపారు. అందుకే పీడి యాక్ట్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. మహిళలపై దాడులు చేస్తే క్షమించేది లేదని ఆయన అన్నారు. నవీన్ రెడ్డి బంధువులు, సహచరులు నుంచి మళ్లీ బెదిరింపులు వస్తున్నాయని బాధిత కుటుంబం ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీనిపై కూడా దృష్టి సారించామని.. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
"మహిళలు భద్రతపై పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది. అమ్మాయిలకు ఇష్టం లేకుండా ఎవరైనా చేయి వేస్తే కఠిన చర్యలు ఉంటాయి. మహిళలకు ఇష్టం లేకుండా 20,30 మంది వెళ్లి దాడి చేస్తే అటువంటి వ్యక్తులను క్షమించే ప్రసక్తే లేదు. అలా తప్పుగా ప్రవర్తిస్తే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. ఎంత పెద్ద వారైనా క్షమించేది లేదు. ఇకపై నుంచి ప్రతి ఒక్కరూ ఆడపిల్లలపై జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాను. ఇలాంటి విషయంలో ప్రత్యేకంగా పనిచేస్తున్నాం. ఈ కేసు విషయంలో మరిన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాం." - సీపీ చౌహన్, రాచకొండ పోలీస్ కమిషనర్
పీడీ యాక్ట్ ఎందుకు పెట్టారు?: హైదరాబాద్‌లో సంచలనం రేకెత్తించిన దంత వైద్య విద్యార్థిని వైశాలి అపహరణ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటి వరకు నవీన్‌రెడ్డిపై ఆదిభట్ల పీఎస్‌లో 5 కేసులు నమోదు అయినట్లు పేర్కొన్న రాచకొండ సీపీ చౌహాన్.. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు అధికారంగా ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే నవీన్‌రెడ్డితో పాటు మరో 40 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. వైశాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాలతో.. షేర్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: