పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న వెంకటాద్రి రిజర్వాయర్ నిర్వాసితుల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. దీక్షా స్థలికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మల్లు రవి, నాగం జనార్దన్‌రెడ్డి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. గత పది రోజులుగా హెచ్‌ఈఎస్ కంపెనీ ముందు ఐదు గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలతో పాటు గత మూడు రోజుల నుంచి 11 మంది నిర్వాసితులు ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీనిని భగ్నం చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఉదయం పోలీసులు దీక్ష చేపట్టిన వ్యక్తులను ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. ఈ సమయంలో నిర్వాసితులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీక్షలో ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.
కేసీఆరే అడ్డంకులు సృష్టిస్తున్నారు...
గత 11 రోజులుగా వట్టెం ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని భట్టి అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం జరగకుండా కేసీఆర్ కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిర్వాసితుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
గుత్తేదారుల కోసమే..
ప్రాజెక్టులకు కేసీఆరే అడ్డుపడుతూ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. గుత్తేదారులకు లబ్ది చేకూర్చాలనే లక్ష్యంతో అంచనా వ్యయం పెంచారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆగదన్నారు.
మొత్తం మీద వెంకట్రాది రిజర్వాయర్ నిర్వాసితులకు కాంగ్రెస్ మద్దతుతో ఈ ఉద్యమం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని హస్తం నేతలు కోరారు. మంత్రుల మెప్పు పొందడానికి ప్రజల జీవితాలను ఫణంగా పెట్టొదని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 9 మంది