US FBI Director Kash Patel : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు భారత సంతతికి చెందిన వ్యక్తులకు కీలక పదవులు కేటాయించారు. తాజాగా కశ్యప్ పటేల్ (కాశ్ పటేల్)కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎప్‌బీఐ) డైరెక్టర్‌గా ఆయన్ను నియమించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
'తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్ సేవలందిస్తారని ప్రకటించేందుకు గర్వంగా ఉంది. కాశ్ గొప్ప న్యాయవాది, పరిశోధకుడు. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయాన్ని గెలిపించేందుకే నిరంతరం శ్రమిస్తున్నారు. అమెరికా ప్రజలకు అండగా నిలిచారు. ఆయన నియామకంతో ఎఫ్‌బీఐకి పూర్వ వైభవం తీసుకొస్తాం'అని సామాజిక మాధ్యమం ట్రూత్‌లో ట్రంప్ పోస్టు చేశారు.
ఇక కశ్యప్ కుటుంబమూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. కాశ్ తండ్రి, ఉగాండలో నియంత ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీ 1980లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్శిటీ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా కొలువు లభించలేదు. దీంతో మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్‌గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.