"రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి పీసీసీ ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ అస్తవ్యస్తం అవుతుంది. సీనియర్లు సహకరించరు. పలువురు పార్టీని వీడతారు. పార్టీ రెండుగా చీలుతుంది" అంటూ కొందరు నేతలు హస్తం పార్టీ అధిష్ఠానానికి లేఖలు రాశారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి పార్టీలో ఏదో జరుగుతుందని… బలహీనంగా ఉన్న పార్టీ అధోగతి పాలవుతుందని పరోక్షంగా హెచ్చరికలు చేశారు. కానీ.. రాష్ట్ర కాంగ్రెస్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. పీసీసీ ఎంపికకు ముందు వర్గపోరుతో సతమతమైన హస్తం పార్టీ....పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది.
అందుకే వాయిదా..
రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి పార్టీ పగ్గాలు ఇవ్వొద్దని అధిష్ఠానంపై సీనియర్లు పెద్ద యుద్ధమే చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత మొదలైన గొడవ.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్.. నాయకుల నుంచి అభిప్రాయ సేకరణతో తారా స్థాయికి చేరింది. నాలుగు రోజుల అభిప్రాయ సేకరణలో మెజారిటీ నేతలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు విషయం బయటకు పొక్కింది. అంతే.. ఇక సీనియర్లు ఒంటి కాలిపై లేశారు. వ్యతిరేక గళాన్ని మరింత పెంచారు. దీనివల్ల అధిష్ఠానం చేస్తున్న కసరత్తు… నూతన పీసీసీ ప్రకటన తరచూ వాయిదా పడుతూ వచ్చింది.
రూట్ మార్చిన రేవంత్..
పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రకటన వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా తన వ్యూహాన్ని మార్చుకున్నారు. ప్రకటన వెలువడిన మరుక్షణం నుంచే సీనియర్ల, అసంతృప్త వాదుల ఇళ్లకు నేరుగా వెళ్లి మాట్లాడారు. అందరం కలిసికట్టుగా పని చేద్దాం అంటూ వారిని తన దారిలోకి తెచ్చుకున్నారు. ఎంపికకు ముందు బహిరంగంగా విమర్శలు చేసిన వీహెచ్ లాంటి వారిని కూడా కలిసి తనకు సానుకూలంగా మార్చుకున్నారు.
రంగంలోకి హైకమాండ్..
రేవంత్ రెడ్డి కలవాలని ప్రయత్నించినా కొందరు నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. ఎంపీ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వంటి నేతలు కలవడానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకున్నారు. అలాంటి వారిని దారిలోకి తేవడానికి హైకమాండ్ పెద్దలు రంగంలోకి దిగారు. హైకమాండ్ జోక్యంతో నేతలందరిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా అధిష్ఠానం జోక్యంతో మిన్నకుండిపోయారు.
చాణక్యనీతితో..
అసమ్మతి జ్వాలలు ఎగిసిపడకుండా నిలువరించడంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) విజయవంతం అయ్యారని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. సీనియర్లు కూడా రేవంత్ రెడ్డికి సహకరిస్తుండడంతో ఇదే తరహాలో.. తనదైన ఆలోచనతో ముందుకు వెళ్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.