Revanth Reddy letter to Kishan Reddy: ఎఫ్‌సీఐ గోదాముల్లో మాయమైన బియ్యంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఏటా వందల కోట్లు అక్రమాలకు పాల్పడుతున్నారని లేఖలో వివరించారు. ఎఫ్‌సీఐ అధికారుల క్షేత్ర తనిఖీల్లో వెల్లడైందని రేవంత్ స్పష్టం చేశారు.
రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 4 లక్షల 53 వేల 896 బస్తాల ధాన్యం కనిపించలేదని, వాటి విలువ రూ. 45 కోట్లుగా ఉంటుందని అధికారులు తేల్చారని లేఖలో రేవంత్ ప్రస్తావించారు. ఎఫ్‌సీఐకి చేరాల్సిన బియ్యం బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సరఫరా చేస్తున్నట్లు నిర్ధరణ అయ్యిందని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,200కు పైగా రైసు మిల్లులు ఉన్నాయని.. వాటిలో 900 మిల్లుల్లో తనిఖీ చేస్తేనే రూ. 400 కోట్ల కుంభకోణం బయటపడిందని పేర్కొన్నారు. దానిపై సమగ్ర విచారణ చేప్టటాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ రికవరీ యాక్టు కింద దోపిడీ సొమ్మును వసూలుచేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ లేఖలో కోరారు.
'రాష్ట్రంలో ఏటా రూ. వందల కోట్ల విలువైన ధాన్యం కుంభకోణం జరుగుతోంది. మిల్లర్లతో కుమ్మక్కై కుంభకోణం చేస్తున్నారు. సీఎంఆర్ పేరుతో మిల్లుల్లో జరిగే అక్రమాలపై విచారణ జరపాలి. మిల్లుల్లో బియ్యం రీసైక్లింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలి. 2014 నుంచి ఇప్పటివరకు సీఎంఆర్ కేటాయింపులపై విచారణ జరపాలి. అక్రమ మిల్లులను సీజ్ చేసి దోపిడీ సొమ్ము వసూలు చేయాలి. కుంభకోణంలో భాగస్వామ్యమైన తెరాస నేతలపైనా చర్యలు తీసుకోవాలి. సీబీఐ విచారణ జరిపించి కిషన్‌రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి' అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చదవండి: Minister Ktr On Dalita Bandhu: 'అలా చేస్తే దళితబంధుతో రెట్టింపు సంపద'
'ట్విట్టర్ మొత్తాన్ని కొనేస్తా'.. మస్క్ ఆఫర్.. అగర్వాల్ ఏం చేసేనో?