బీబీ నగర్ ఎయిమ్స్ కోసం ప్రభుత్వం స్థలమివ్వలేదని.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (minister harish rao on kishan reddy)దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉండి కిషన్‌రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఎయిమ్స్‌కు స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి సరైన వాళ్లను తన సలహా బృందంలో నియమించుకోవాలని సూచించారు. అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
'తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదే...'
దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలను కేంద్రం ఇచ్చిందని.. అందులో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని హరీశ్ (minister harish rao on kishan reddy) ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి వైద్యకళాశాల తీసుకురావాలని హరీశ్ డిమాండ్ చేశారు. కేంద్రం మొండిచేయి చూపినా రాష్ట్రంలో కొత్తగా వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని... 31 జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తామని విభజన చట్టంలోనే కేంద్రం హామీ ఇచ్చిందని.. తామేకి కొత్తగా కోరడం లేదని హరీశ్ గుర్తుచేశారు.
విభజన హామీలు అమలయ్యేలా చూడండి..
విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన వర్సిటీని రాష్ట్రానికి ఇప్పించాలని కిషన్‌రెడ్డిని కోరుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీల జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ జనగణన చేయించాలని కిషన్‌రెడ్డిని కోరుతున్నామన్నారు.
తెలంగాణను చిన్నచూపు చూస్తోంది..
ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. కేంద్రంలోని భాజపా రాష్ట్ర ప్రజలను చిన్నచూపు చూస్తోందని హరీశ్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. రా రైస్ కొంటామని కిషన్‌రెడ్డి కొత్తగా చెబుతున్నారు.. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం బాయిల్డ్ రైసే వస్తుందన్నారు. బాయిల్డ్ రైస్ అనేది రాష్ట్రంలో కొత్తగా సాగు చేస్తుంది కాదని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
సిలిండర్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వేయడం లేదని స్పష్టం చేసిన హరీశ్‌రావు.. సిలిండర్లపై పన్ను విధిస్తున్నట్లు భాజపా అవాస్తవాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెరాస ధర్నా.. రేపు ప్రారంభం మాత్రమేనని.. రాష్ట్ర హక్కుల సాధన కోసం ధర్నాలు కొనసాగిస్తామని హరీశ్‌రావు తెలిపారు. హక్కుల సాధనకు పార్లమెంటులోనూ కేంద్రాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
ఇదీచూడండి: BJP protest over paddy purchase : ధాన్యం కొనుగోళ్లపై భాజపా ధర్నాలు.. పలుచోట్ల ఉద్రిక్తతలు