RAINS IN AP: ఏపీలోని కోస్తాంధ్ర తీరాన్ని అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ తెలిపింది. రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్ర ప్రాంతంలోని ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంబడి అల్పపీడనం బలపడనున్నట్లు.. ఎల్లుండి వరకు ఏపీ ప్రాంతంగా విసృత్తంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీలోని పలు ప్రాజెక్టులకు చేరుతున్న వరద ప్రవాహం..
పులిచింతల ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం: ఏపీలోని పల్నాడు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. కృష్ణా నదికి ఎగువున కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నుంచి 3 లక్షల 31 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండడంతో పులిచింతల ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తి నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ దిగువన నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
సోమశిల జలాశయానికి పెరిగిన వరద: ఆంధ్రలోని నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉద్ధృతి పెరుగుతోంది. అనంతసాగరం, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం మండలాల్లోని పెన్నా పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా ప్రస్తుతం జలాశయంలో 72 టీఎంసీల నీటినిల్వ ఉంది.
శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ఉద్ధృతి : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 12 అడుగులు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3 లక్షల 18 వేల క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.70 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.60 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 62 వేల 404 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎగువ నుంచి లక్షా 4 వేల 126 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. డెల్టా కాలువలకు 15 వేల 376 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. 70 గేట్లను పైకెత్తి 88 వేల 750 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. నాగార్జున సాగర్, పులిచింతల డ్యామ్ లనుంచి వచ్చే వరద ప్రవాహన్ని యథాతథంగా ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా పడిన వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. హైటెక్ బస్టాండ్, కంబాలచెరువు, వీఎల్ పురం, రైల్వేస్టేషన్ రోడ్, డీలక్స్ సెంటర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. దీనివల్ల వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది.
పీఏబీఆర్ జలాశయానికి భారీగా వరద: అనంతపురం జిల్లా కూడేరు మండలం పీఏబీఆర్ జలాశయానికి భారీగా వరద చేరుతోంది. పేరూరు జలాశయం నుంచి 25 వేల క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండడంతో 7 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పేరూరు జలాశయం నుంచి గ్రామంలోకి వస్తున్న నీటి ప్రవాహంతో.. గ్రామాన్ని ప్రజలు ఖాళీ చేస్తున్నారు.
జమ్మలమడుగు వద్ద తెగిన పాత వంతెన : వైఎస్సార్ జిల్లాలో కురిసిన వర్షానికి అర్ధరాత్రి జమ్మలమడుగు వద్ద పాత వంతెన రోడ్డు తెగిపోయింది. దాంతో జమ్మలమడుగు నుంచి ముద్దనూరుకు రాకపోకలు నిలిచాయి. వంతెన తెగడంతో సుమారు 16 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో పెన్నా నది వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో రామేశ్వరం-థర్మల్ రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిపివేశారు.
ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర నది ప్రవాహం: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ప్రమాదకర స్థాయిలో తుంగభద్ర నది ప్రవాహం కొనసాగుతోంది. పుష్కర ఘాట్లు, గంగమ్మ గుడి, నీటి ప్రాజెక్టుల మోటార్లు పూర్తిగా వరద నీటిలో మునిగాయి. దీంతో తుంగభద్ర నదిలో భక్తులకు స్నానాలు నిలిపివేశారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.హొళగుంద మండలం మార్లమడికి వద్ద ఉన్న వేదవతి నది వద్ద వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో ఆంధ్రా-కర్ణాటక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హాలహర్వి మండలం గూళ్యం, సిద్ధాపురం, బల్లూరులో పంటపొలాలు నీటమునిగాయి. అమృతాపురంలో టోపి మారెమ్మవ్వ ఆలయంలోకి వరద నీరు చేరింది.
ఇవీ చదవండి: