CM KCR on Social Media: రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధినేత. అత్యంత ప్రజాదారణ ఉన్న నాయకుడు. ప్రజల పల్స్ పట్టుకోవటంలో నిపుణుడు. ప్రత్యేక రాష్ట్ర సాధకుడు. కొన్ని సార్లు అంతుపట్టని మార్మికుడు. మత విశ్వాసాల విషయంలో ధార్మికుడు. అటువంటి వ్యక్తిని పట్టుకుని వ్యక్తిగతంగా, అనైతికంగా టార్గెట్ చేస్తూ కొన్ని సామాజిక మాధ్యమాలు చేస్తున్న ప్రచారం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లింది. హద్దులు దాటి సీఎంపై కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు చేసిన వీడియోలను పోలీసు అధికారులు, తెరాస ఐటీ విభాగంలో కీలక వ్యక్తులు కేసీఆర్ దృష్టికి వాటిని తీసుకుని వెళ్లారని విశ్వసనీయ సమాచారం.
చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో...
అవాస్తవాలను, అసత్యారోపణలను విశృంఖలంగా జనంలోకి తీసుకుని వెళ్లటం ద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న ఇలాంటి పోస్టులను ఎందుకు ఉపేక్షిస్తున్నారని అధికారులను సీఎం తలంటినట్లు సమాచారం. మొత్తం అటువంటి వీడియోలు, యూట్యూబ్ ఛానెళ్లు, ఫేస్‌బుక్ పేజీలు, గ్రూపులు, వాట్సప్ సందేశాలు అన్నింటినీ వివిధ కేటగిరీలుగా తీసి వాటిపై చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో స్టడీ చేయమని కొందరికి ప్రత్యేకంగా ఈ టాస్క్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరీ దారుణంగా వీడియోలు చేస్తున్న వాటిని మొదట రిమూవ్ చేయించటం, తర్వాత దాని బాధ్యులపై నిఘా, ఆధారాల సేకరణ తర్వాత వారిని అదుపులోకి తీసుకోవటానికి సన్నాహాలు చేస్తున్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసింది.
అది జస్ట్ టీజర్ మాత్రమే...
దీనిలో భాగంగా కొంతమంది వ్యక్తుల కదలికలను పోలీసులు గమనిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం వారు పెడుతున్న పోస్టులపై ఓ కన్నేసి ఉంచటమే కాకుండా పాత పోస్టులు అన్నింటిని తవ్వి తీసి వాటిపై కూడా చర్యలకు దిగాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 1న సీఎం కేసీఆర్ నిర్వహించిన సుదీర్ఘ మీడియా సమావేశంలో సోషల్ మీడియా వాళ్ల సంగతి తెలుస్తా అని చెప్పటం జస్ట్ టీజర్ మాత్రమే అని అసలు సినిమా ముందు ఉందని తెరాస ఐటీ విభాగం ప్రతినిధి ఒకరు 'ఈటీవీ భారత్'కు చెప్పారు.
ప్రభుత్వం కొరడా ఝులిపిస్తే
'సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో చీఫ్ మినిస్టర్ గురించి తప్పుడు ప్రచారం చేయటం పరిపాటిగా మారింది. ఐడియలాజికల్ డిఫరన్సెస్ కారణంగా రాజకీయ వైరంతో సీఎంపై దుష్పచారం చేస్తున్నది కొందరు అయితే మరికొందరు డబ్బుల కోసం, వ్యూస్ కోసం ఇలాంటి చిల్లర పోస్టులు పెడుతున్నారు. సీఎం ఆరోగ్యం గురించి, ఆయన మనుమడి బాడీ షేప్ గురించి పెట్టినా చాలా సార్లు కేసీఆర్ సంయమనం పాటించారు. విమర్శలు... అది పత్రికలో అయినా, టీవీలో అయినా, సోషల్ మీడియాలో అయినా పరిధి దాటనంత వరకే' అని తెరాస ఐటీ విభాగం నాయకుడు చెప్పుకొచ్చారు. నిజంగానే ప్రభుత్వం కొరడా ఝులిపిస్తే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు, ఫేస్‌బుక్ అకౌంట్లకు కష్టాలు తప్పేలా లేవు.
ఇదీ చదవండి : సామాజిక మాధ్యమాలపై పోలీసు కన్ను.. విద్వేషాలు రెచ్చగొడితే ఇక అంతే!