Black Fungus : కొవిడ్ బాధితుల్లో చాలా మందిలో మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్‌ఫంగస్) ఫంగల్ ఇన్ఫెక్షన్ బయటపడింది. దీని తీవ్రతకు చాలామంది దవడ ఎముక, కనుగుడ్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రాణాంతక ఫంగస్ ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తించేందుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) ఆచార్యుల నేతృత్వంలోని బృందం కృత్రిమ మేధ ఆధారంగా ఓ అధ్యయనం చేసింది.
30 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 1,229 మంది కొవిడ్ పాజిటివ్ రోగులు, బ్లాక్ ఫంగస్ బారిన పడిన 214 మందికి సంబంధించి డేటాను సేకరించి అధ్యయనం చేశారు. మొత్తం 74 రకాల జబ్బులకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఊబకాయం, వాసన కోల్పోవడం, ఇన్సులిన్ వాడుతున్న మధుమేహగ్రస్థులు, కండరాల నొప్పులు, ముక్కు కారడం లక్షణాలు ఉన్నవారు బ్లాక్‌ఫంగస్ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ తరవాత బ్లాక్‌ఫంగస్ ప్రమాదం ఉంటుందని గుర్తించారు.
హెచ్‌సీయూ స్కూల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ బి.రాజశేఖర్, ప్రొఫెసర్ జి.వి.ఆర్.కె.ఆచార్యులు, డా.రామయ్య, గాంధీ వైద్య కళాశాల ప్రొఫెసర్ ఎ.శోభన్‌బాబు, డా.నరేష్, వెంకటరమణ, బెంగళూరుకు చెందిన డేటా సైంటిస్ట్ సూర్యతో పాటు విదేశీ వర్సిటీలకు చెందిన మరో ముగ్గురు ఆచార్యులు మొత్తం 10 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. ఈ నివేదిక ప్రతిష్ఠాత్మక జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షన్‌లో ఇటీవల ప్రచురితమైందని వర్సిటీ వర్గాలు తెలిపాయి.