వీలైతే భాగస్వాములు అవ్వండి.. లేకుంటే ఊరుకోండి: డీకే అరుణ - తెరాస విమర్శలపై డీకే అరుణ మండిపాటు
తెరాస నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నప్పటికీ.. భాజపా కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడం దారుణమని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. తెరాస నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నప్పటికీ... భాజపా కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. వరంగల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తెరాస ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు. భాజపా కార్యకర్తలు, నేతలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీరాముడిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఇచ్చి రామ మందిరాన్ని నిర్మించేందుకు చాలా మంది ఉన్నారని... ప్రజలందరినీ భాగస్వామ్యం చేసేందుకు నిధి సమర్పణ కార్యక్రమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ధనంతో యాదాద్రిని పునర్ నిర్మిస్తూ... ముఖ్యమంత్రి సొంత డబ్బులతో కడుతున్నట్టు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి రామాలయ నిర్మాణం ఇష్టం ఉందో... లేదో స్పష్టం చేయాలన్నారు. భద్రాద్రి రాముడికి ఎన్నిసార్లు తలంబ్రాలు సమర్పించారని ప్రశ్నించారు. వీలైతే పాల్గొనాలి... లేకుంటే నోరుమూసుకోని కూర్చోమని మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారని కేసీఆర్కు సూచించారు.