కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతుల సరైనని కావని హయాతుద్దీన్, విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులే లేవని వేములఘాటు రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యూనల్ సోమవారం విచారణ జరిపింది. నిర్మాణం ఇప్పటికే పూర్తైనందున పర్యావరణ అనుమతులు సరైనవి కావన్న అంశంలో ఏం చేయగలమని పిటిషనర్ హయాతుద్దీన్ తరపు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని వివరాలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణానికి ముందే తీసుకోవాల్సిన పర్యావరణ అనుమతులు... పనులు ప్రారంభించాక సమాంతరంగా పొందారని న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల... ప్రభావం, జరిమానా విధింపు వంటి అంశాలపై కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
పిటిషనర్ లేవనెత్తిన అంశాలతో విభేదించిన అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు... పర్యావరణ అనుమతులతోనే ప్రాజెక్టు నిర్మించినట్టు తెలిపారు. కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్లలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి విస్తరణ పనులు ఆపాలని లేఖ రాసినట్టు ఎన్జీటీ గుర్తు చేసింది. రూ.21 వేల కోట్లతో చేపట్టిన విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవని వేములఘాట్ రైతుల తరపు న్యాయవాది ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన తర్వాత ఒక్కసారి కూడా మోటార్లతో నీటిని వినియోగించకుండానే విస్తరణ పనులు చేపట్టారని వాదించారు.
ప్రాజెక్టు విస్తరణలో ఎక్కడా అదనపు భాగాలు లేవని... సాగునీటి విస్తీర్ణం కూడా పెరగలేదని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు. కేవలం ఎత్తిపోసే నీటిని మాత్రమే పెంచామని పర్యావరణ అనుమతులు తీసుకునేలా ప్రాజెక్టు విస్తరణ చేపట్టలేదని ఎన్జీటీకి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ ధర్మాసనం... తీర్పును ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: ఓటమి చవిచూసిన చోటు నుంచే కవిత గెలుపు