SBI results q4 2022: మొండి బకాయిల వసూలుతో భారతీయ స్టేట్ బ్యాంక్‌కు కాసుల పంట పండింది. 2021-22 నాలుగో త్రైమాసికంలో(జనవరి-మార్చి) ఎస్బీఐ నికర లాభం ఏకంగా 41శాతం పెరిగి రూ.9,114 కోట్లకు చేరింది. 2020-21 క్యూ4లో ఈ మొత్తం రూ.6,451కోట్లుగా ఉంది.
2021-22 క్యూ4లో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆదాయం రూ.82,613 కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో స్థూల ఆదాయం రూ.81,327కోట్లుగా ఉంది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ఈ స్థాయిలో మెరుగుపడేందుకు మొండి బకాయిల వసూలులో పురోగతే ప్రధాన కారణమని రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో పేర్కొంది ఎస్బీఐ. 2021 క్యూ4తో పోల్చితే 2022 మార్చి 31 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 4.98 నుంచి 3.97శాతానికి దిగొచ్చినట్లు తెలిపింది. మొండి బకాయిల నికర విలువ 1.5 నుంచి 1.02శాతానికి తగ్గినట్లు వివరించింది.
SBI dividend: 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూస్తే భారతీయ స్టేట్ బ్యాంక్ రూ.31,676కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2020-21లో వచ్చిన రూ.20,410కోట్ల నికర లాభంతో పోల్చితే ఇది 55శాతం అధికం కావడం విశేషం. భారీ లాభాల నేపథ్యంలో వాటాదారులకు శుభవార్త చెప్పింది స్టేట్ బ్యాంక్. ఒక్కో షేరుపై రూ.7.10 డివిడెండ్ ప్రకటించింది. మరోవైపు.. మెరుగున ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజిలో స్టేట్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి.
Bandhan bank results q4 2022: మరోవైపు.. ప్రైవేటు రంగంలోని బంధన్ బ్యాంక్.. 2022 క్యూ4లో భారీ స్థాయిలో లాభాలు గడించింది. 2022 జనవరి-మార్చి మధ్య ఏకంగా రూ.1,902.30 కోట్లు ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ విలువ రూ.103 కోట్లు మాత్రమే కావడం విశేషం. 2022 క్యూ4లో బంధన్ బ్యాంక్ ఆదాయం 43శాతం వృద్ధితో రూ.3,504.2కోట్లకు చేరింది.