రుణ గ్రహీతలకు కాస్త ఊరటనిచ్చేలా గత ఏడాది విధించిన మారటోరియం కాలానికి ఎలాంటి చక్ర వడ్డీ, ఆలస్య చెల్లింపులపై వడ్డీ విధించొద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే బ్యాంకులు అలా వడ్డీ వసూలు చేసి ఉంటే.. ఆ మొత్తాన్ని రుణగ్రహీతలకు తిరిగి చెల్లించడం లేదా సర్దుబాటు చేయాలని సూచించింది. అయితే.. ఆగస్టు 31 వరకు ఉన్న రుణ మారటోరియం కాలాన్ని పొడిగించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది. పూర్తి వడ్డీ మాఫీ చేయమని కూడా చెప్పలేమని పేర్కొంది.
కొవిడ్ మహ్మమారిని దృష్టిలో పెట్టుకుని మారటోరియం కాలంలో చక్రవడ్డీ మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం సుప్రీం ఈ తీర్పు వెలువరించింది. ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని కోర్టు వెల్లడించింది. అలాగే ఇప్పటికే రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం మాఫీ చేసిందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.