మార్కెట్లోకి ప్రవేశిస్తూనే.. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటి నుంచి సరికొత్త ఆఫర్లతో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షిస్తూ.. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూనే ఉంది. తాజాగా ప్రకటించిన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో మరో అడుగు ముందుకేసింది.
అయితే ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా భారీగానే పడింది. తక్కువ ధరలో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తూ రిలయన్స్ మంగళవారం చేసిన ప్రకటనతో.. బుధవారం ఇతర టెలికాం దిగ్గజాలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా(వీ) షేర్లు భారీగా కుప్పకూలాయి.
వొడాఫోన్ ఐడియా షేర్లు బీఎస్ఈలో భారీగా (10.05శాతం) నష్టపోయాయి. దీంతో ఒక షేరు విలువ ప్రస్తుతం రూ.9.22గా ఉంది.
మరోవైపు ఎయిర్టెల్ షేర్లు కూడా బీఎస్ఈలో 7.89శాతం పడిపోయాయి. ఒక్క ఎయిర్టెల్ షేరు విలువ రూ.423.95 వద్దకు చేరింది. 30 షేర్ల ఇండెక్స్‌లో బుధవారం అత్యధికంగా నష్టపోయిన కంపెనీ కూడా ఇదే కావడం గమనార్హం.