ఆర్‌కామ్ అధినేత అనిల్ అంబానీకి ఊరట లభించింది. స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్కు చెల్లించాల్సిన బకాయిలు రూ. 550 కోట్లను మొత్తం చెల్లించారు. అయితే... ఈ చెల్లింపుల్లో తన సోదరుడు ముకేష్ అంబానీ, వదిన నీతా అంబానీ సహాయం చేసినట్లు వెల్లడించారు అనిల్. సరైన సమయంలో తోడ్పాటుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏంటీ వివాదం
ఆర్‌కామ్ నెట్‌వర్క్‌ను ఏడేళ్లపాటు నిర్వహించేందుకు 2013లో చేసుకున్న ఒప్పందం మేరకు తమకు రూ. 16 వందల కోట్ల వరకు రావాల్సి ఉందని ఎరిక్సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.తమ ఆదేశాల మేరకు బకాయిలు చెల్లించకపోవడం.. కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని పేర్కొంది. ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్షఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్‌ను కోర్టు హెచ్చరించింది. అనంతరం తొలుత 118 కోట్లు చెల్లించిన అనిల్... తాజాగా మొత్తం బకాయిలు తీర్చారు.గడువుకు ఒక రోజు ముందు అన్న ముకేశ్ ఆదుకొని అనిల్‌ని గట్టెక్కించారు.
అన్నావదినలకు కృతజ్ఞతలు...
"క్లిష్టపరిస్థితుల్లో మద్దతుగా నిలిచినందుకు సోదరుడు ముకేశ్, వదిన నీతాలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. గతాన్ని మరచి నాకు సాయం చేసినందుకు ఆనందంగా ఉంది" అని అనిల్ పేర్కొన్నట్లు ఆర్‌కామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
స్పందించిన ఎరిక్సన్
ఆర్‌కామ్ తమకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు వడ్డీతో సహా అందాయని ధ్రువీకరించారు ఎరిక్సన్ సంస్థ ప్రతినిధి. సోమవారం రూ. 458. 77 కోట్లు చెల్లించారని తెలిపారు. ఇంతకుముందు చెల్లించిన రూ. 118 కోట్లతో కలిపి బకాయిలన్నీ వడ్డీలతో సహా తీర్చినట్లు స్పష్టం చేశారు.