దేశంలో లాక్‌డౌన్ 49 రోజులు పూర్తయ్యాక.. 'విస్తృత స్థాయి'లో ఎత్తివేయాలని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 'ఒకదాని తర్వాత ఒకటి తరహాలో' సడలింపులు ఇస్తూ ఉంటే.. పారిశ్రామిక పురోగతి తీవ్ర మందగమనంలో నడుస్తుందని హెచ్చరించారు. లాక్‌డౌన్ నిష్క్రమణ వ్యూహాన్ని రచించడం ప్రభుత్వానికి చాలా సంక్లిష్టమైన సవాలని ఆయన అన్నారు. విస్తృత స్థాయిలో ట్రాకింగ్ చేపట్టి.. పరీక్షలు నిర్వహించడం ద్వారా కట్టడి ప్రణాళికలు రచించాలని సూచించారు. కేవలం హాట్‌స్పాట్, సునిశిత ప్రాంతాల్లోని వ్యక్తులకే ఐసోలేషన్‌ను పరిమితం చేయాలని అన్నారు.
'49 రోజుల లాక్‌డౌన్ అనేది సరైన పద్ధతి అని పరిశోధకులు సూచిస్తున్నారు. అదే నిజమైతే ఆ గడువు తర్వాత లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో ఎత్తివేయాల'ని మహీంద్రా తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ‘ఒక వేళ క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి అనే తరహాలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే అది పరిశ్రమ రికవరీకి తోడ్పడకపోవచ్చు. తయారీ విషయానికే వస్తే ఫీడర్ ఫ్యాక్టరీ లాక్‌డౌన్‌లో ఉంటే.. తుది ఉత్పత్తిని అసెంబ్లింగ్ చేసే ఫ్యాక్టరీలు తెరచి లాభం ఉండద’ని ఆయన అభిప్రాయపడ్డారు. తొలుత మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన ప్రధాని.. ఆ తర్వాత మే 3 వరకు దానిని పొడిగించారు. దీంతో మొత్తం లాక్‌డౌన్ రోజుల సంఖ్య 40 రోజులైంది.
ఇదీ చూడండి:భారత్‌కు ఏడీబీ రూ.11,400 కోట్ల సాయం