రాబోయే అయిదేళ్లలో ఐటీ, బ్యాంకింగ్‌తో పాటు ఇతర సేవలకు సంబంధించిన సంస్థల కార్యాలయాలకు వచ్చి, విధులు నిర్వహించే ఉద్యోగుల సంఖ్య 25 శాతానికి తగ్గిపోతుందని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీంతో కంపెనీలకు కార్యాలయాల నిర్వహణ ఖర్చు తగ్గిపోతుంది. వర్క్ ఫ్రం హోంతో నగరాల్లో ట్రాఫిక్‌లో గంటల తరబడి ఇబ్బందిపడే బాధ ఉద్యోగులకు తప్పుతుంది. దీని వల్ల మహిళలకు మేలు జరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
లాక్‌డౌన్ రూపంలో ఎదురైన పెనుసవాల్‌ను 180 బిలియన్ డాలర్లకు చేరిన దేశీయ ఐటీ రంగం దీటుగా ఎదుర్కొంటోంది. అత్యధిక ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించడం కారణంగా ప్రాజెక్టుల్లో అంతరాయం ఏర్పడకుండా కంపెనీలు చూసుకుంటున్నాయి. ఫలితంగా కార్యాలయ ఖర్చులు తగ్గిపోగా.. ఉత్పాదకత పెరిగింది. 2025 నాటికి 25 శాతం మంది ఉద్యోగులే కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని తమ సంస్థ అంచనగా టీసీఎస్ సీఓఓ గణపతి సుబ్రమణియన్ ఇటీవల వెల్లడించారు. తమ 3.55 లక్షల మంది నిపుణుల్లో 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగులకు మేలుతో పాటు సంస్థలకు వ్యయం తగ్గుతున్నందున, ఇంటి నుంచే పనిని చేసేలా చూస్తామని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురి తెలిపారు.
ఇదీ చూడండి:కరోనా సోకకుండా ఏటీఎంలో ఇలా వ్యవహరించండి!