స్టాక్ మార్కెట్లు గురువారం చారిత్రక రికార్డు స్థాయిలను తాకి.. సెషన్ చివరి గంటలో యూ టర్న్ తీసుకున్నాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 167 పాయింట్లు తగ్గి 49,624 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 14,590 వద్దకు చేరింది.
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించడం సహా దేశీయ సానుకూలతలతో గురువారం సెషన్లో సూచీలు సరికొత్త గరిష్ఠాన్ని తాకాయి. అయితే మదుపరులు చివరి గంటలో లాభాల స్వీకరణకు దిగటం వల్ల సూచీలు నష్టాల మూటగట్టుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ ఇంట్రాడేలో చారిత్రకమైన 50 వేల మార్క్‌ను దాటింది. ఒకానొక దశలో 50,184 వద్దకు చేరింది. లాభాల స్వీకరణ కారణంగా 49,398 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
నిఫ్టీ 14,753 పాయింట్ల గరిష్ఠ స్థాయి (సరికొత్త రికార్డు), 14,517 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
ఇతర మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, నిక్కీ, సియోల్ సూచీలు లాభాలను గడించాయి. హాంకాంగ్ సూచీ మాత్రం నష్టాలను నమోదు చేసింది.
ఇదీ చూడండి:30 ఏళ్లు, 50 వేల పాయింట్లు.. సెన్సెక్స్ ప్రస్థానం ఇలా...