అమెరికా నుంచి భారత ఔషధాలు వెనక్కి! - అమెరికా ఎఫ్‌డీఏ
అమెరికా మార్కెట్ నుంచి భారత ఔషధ సంస్థలు తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ ప్రకారం సరైన విధానాలు పాటించని, లోపాలతో కూడిన ఉత్పత్తులను ఆ దేశం నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. అరబిందో ఫార్మా, జైడస్, జుబిలాంట్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
భారత ఔషధ సంస్థలు అమెరికా మార్కెట్ నుంచి తమ ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్-ఎఫ్‌డీఏ) ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ప్రకారం అరబిందో ఫార్మా, జైడస్, జుబిలాంట్, మార్క్సన్స్ ఫార్మా సంస్థలు ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నాయి.
దాదాపు ఆరు లక్షల బాటిళ్ల డయాబెటిస్ ఔషధాలను మర్క్సన్స్ సంస్థ వెనక్కి తీసుకుంటోంది. 500ఎంజీ, 750 ఎంజీ మోతాదులో లభించే వీటిని గోవాలోని తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తోంది. వీటి తయారీలో వాడే ఎన్-నైట్రోసోడిమిథిలమైన్(ఎన్డీఎంఏ) స్వచ్ఛత ఆమోదించగలిగే స్థాయిలో లేదని ఎఫ్‌డీఏ గుర్తించింది. అందుకే వీటిని సంస్థ ఉపసంహరించుకుంటోంది.
ఎన్డీఎంఏను మానవ క్యాన్సర్ కారకంగా పరిగణిస్తారు. వీటి మోతాదుపై ఎఫ్‌డీఏ నివేదిక విడుదల చేసిన తర్వాత ఇతర సంస్థలు సైతం ఈ తరహా ఔషధాలను అమెరికా మార్కెట్ నుంచి బయటకు తీసుకొస్తున్నాయి.
మరోవైపు, నొప్పిని సంహరించే డ్రగ్స్‌ను అరబిందో ఫార్మా, మనోవైకల్యానికి వాడే ఔషధాన్ని జుబిలాంట్ కాడిస్టా, కడుపులో ఆమ్లాలను తగ్గించే ఔషధాన్ని జైడస్ ఫార్మాస్యుటికల్స్.. అమెరికా మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నాయి.
మిశ్రమం తయారీలో సరైన స్పెసిఫికేషన్స్ పాటించకపోవడం వల్లే 14,748 కార్టన్ల లాన్సోప్రజోల్ ట్యాబ్లెట్లను ఉపసంహరించుకున్నట్లు జైడస్ ఫార్మా తెలిపింది. అహ్మదాబాద్‌లోని కాడిలా హెల్త్‌కేర్‌లో వీటి ఉత్పత్తి జరిగిందని వెల్లడించింది. లేబులింగ్ లోపాల వల్ల 7,440 బాటిళ్ల ఇబుప్రొఫెన్ ఓరల్ డ్రగ్‌ను అరబిందో వెనక్కి తీసుకుంది.