కొరియా దిగ్గజ ఆటోమోబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ అపూర్వమైన మైలురాయిని అందుకుంది. దేశీయ కార్ల తయారీ, ఎగుమతుల్లో అరుదైన ఘట్టాన్ని లిఖించింది. ఇప్పటివరకు భారత్‌లో ముప్పై లక్షల కార్లను తయారు చేసి ఎగుమతి చేసినట్లు ప్రకటించింది.
తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ ప్లాంటు నుంచి విడుదల చేసిన హ్యుందాయ్ ఆరా కారుతో మొత్తం ఎగుమతులు ముప్పై లక్షలకు చేరుకున్నట్లు తెలిపింది. గ్రాండ్ ఐ10 కారునే ఆరాగా పేరు మార్చి కొలంబియా మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ సందర్భంగా హ్యుందాయ్ ఆరా కార్ల ఎగుమతులు ప్రారంభించినట్లు తెలిపింది.
1998వ సంవత్సరంలో కార్ల తయారీ ప్రారంభించిన తర్వాత అత్యంత వేగవంతంగా ముప్పై లక్షల కార్లను తయారు చేసినట్లు ప్రకటించింది.
"భారత్‌లో తయారు చేసి ఎగుమతి చేసిన ఈ 30 లక్షో కారు ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా హ్యుందాయ్ విజయగాథను తెలియజేస్తుంది. 1999లో ఎగుమతులను ప్రారంభించి మేం ఎన్నో మైలురాళ్లను అందుకున్నాం. గ్లోబల్ కస్టమర్లు, విదేశీ పంపిణీదారులు మాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు."-కిమ్, హ్యుందాయ్ ఎండీ, సీఈఓ
2019 సంవత్సరంలో ఆయా దేశాల ప్రాధాన్యాలు, డిమాండ్లకు అనుగుణంగా 792 వేరియంట్లలో 1.81 లక్షల వాహనాలను ఎగుమతి చేసినట్లు కంపెనీ ఎండీ కిమ్ తెలిపారు. ఎగుమతుల్లో 26 శాతం మార్కెట్ వాటాతో భారతీయ ఆటోమొబైల్ రంగానికి హ్యుందాయ్ తోడ్పాటునందిస్తోందని చెప్పారు. గత రెండు దశాబ్దాలుగా తయారీ కేంద్రంలో రూ.24 వేల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు స్పష్టం చేశారు. నూతన ఉత్పత్తుల కోసం అదనంగా రూ.7 వేల కోట్లను ప్రకటించినట్లు తెలిపారు.
ఎగుమతులు..
1999లో హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఎగుమతులు ప్రారంభించింది. తొలిసారి 20 సాంట్రో కార్లను నేపాల్‌కు ఎగుమతి చేసింది. 2004 అక్టోబర్ నాటికి లక్ష కార్లను ఎగుమతి చేసింది. అనంతరం 2008 మార్చి నాటికి ఐదు లక్షలు, 2010 ఫిబ్రవరి నాటికి 10 లక్షలు, 2014 మార్చి నాటికి 20 లక్షల కార్లను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.
నాలుగు ఖండాల్లోని 88 దేశాలకు హ్యుందాయ్ మోటార్ ఇండియా... కార్లు ఎగుమతి చేస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనం కోనా సహా 13 రకాల మోడళ్లను ఎగుమతులు చేస్తోంది. ఇండియాలో 1,329 సర్వీస్ కేంద్రాలు, 515 డీలర్లను కంపెనీ కలిగి ఉంది.